
జగదేవపూర్, వెలుగు: అత్తగారి ఆస్తిలో వాటా కోసం గొడవ పడిన అల్లుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, గ్రామస్తుల వివరాల ప్రకారం.. జగదేవపూర్ మండలం పలుగడ్డకు చెందిన కుమార్(33) అదే గ్రామానికి చెందిన ఆరుముళ్లు సోమయ్య, నరసమ్మల కూతురు బాలామణిని ఎనిమిదేళ్ల కింద పెళ్లి చేసుకున్నాడు. అత్తగారి భూమిలో వాటా కోసం కొన్నిరోజులుగా భార్యా, భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. గురువారం కూడా గొడవ కావడంతో కుమార్ ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. రాత్రయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికినా ఆచూకీ దొరకలేదు. శుక్రవారం ఉదయం బావి వద్దకు వెళ్లి చూడగా.. పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా.. సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కృష్ణమూర్తి తెలిపారు.