ఇందిరమ్మ ఇండ్లకు ప్రత్యేక యాప్.. డిసెంబర్ 6 నుంచి లబ్ధిదారుల ఎంపిక​

హైదరాబాద్: సీఎం రేవంత్​రెడ్డి చేతులమీదుగా రేపు ఇందిరమ్మ ఇండ్లకు ప్రత్యేక యాప్‎ను ప్రారంభిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇవాళ మీడియాతో ఆయన మాట్లాడారు. ఎల్లుండి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్లకు అర్హులైన లబ్ధిదారుల ఎంపిక కోసం అధికారులే స్వయంగా ఊరురా వస్తారన్నారు. ఇందిరమ్మ ఇండ్ల ప్రక్రియ కాస్త ఆలస్యం అయినా నిజమైన లబ్ధిదారులకు న్యాయం జరిగేలా ఇండ్లు ఇస్తామన్నారు. ‘మాది పేదల ప్రభుత్వం. గతంలో అర్హులను పక్కన పెట్టి పింక్ కలర్ షర్ట్ వేసుకున్న వాళ్లకే డబుల్​బెడ్​రూమ్​ఇండ్లు ఇచ్చారు.  స్కీంల బొమ్మలు చూపించి ప్రజలను మోసం చేశారు. ఇచ్చింది మాత్రం ఏమీలేదు. గత ప్రభుత్వం ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చింది.

 అధికార దాహంతో మా ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు. మూసీ డీపీఆర్  ప్రభుత్వం తయారు చేయలేదు. దానిపై దోచుకుంటున్నారని అనడం సిగ్గు చేటు. ఏడాదిలో 50వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చాం. గతంలో ఏ పరీక్ష నిర్వహించిన జీరాక్స్ సెంటర్లలో పేపర్లు దొరికేవి. ఇందిరమ్మ రాజ్యంలో అనవసరంగా కేసులు పెట్టి వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టం. ఏదైనా చట్టపరంగా ముందుకు పోతాం. జైల్లో పెడితే పొలిటికల్ మైలేజ్ వస్తుంది అని కొందరు అనుకుంటున్నారు. గతంలో జరిగిన అక్రమాలపై విచారణలు జరుగుతున్నాయి. గ్రేటర్ పరిధిలో ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర ప్రణాళిక సిద్ధంగా ఉంది.’ అని పొంగులేటి అన్నారు.