నాలుగో అంతస్తులో ఏర్పాట్లు పూర్తి
హైదరాబాద్, వెలుగు: బేగంపేటలోని మెట్రో భవన్ లో సీఎం కేసీఆర్ కోసం ప్రత్యేక చాంబర్ ను ఏర్పాటు చేస్తున్నారు. మెట్రో భవన్ 4వ అంతస్తులో విశాలమైన చాంబర్ ను రెడీ చేశారు. గతంలో అదే అంతస్తులో మెట్రో ఎండీ చాంబర్ ఉండేది. 4 రోజుల క్రితం ఎండీ చాంబర్ ను మొదటి అంతస్తుకు షిఫ్ట్ చేశారు. కొత్త సెక్రటేరియట్ నిర్మాణం కోసం అన్ని శాఖలను బీఆర్కే బిల్డింగ్ కు తరలించారు. సీఎంవో కార్యాలయాన్ని బేగంపేటలోని హెచ్ఎంఆర్ఎల్ బిల్డింగ్ కు షిప్ట్ చేశారు. సీఎంవో సెక్రటరీలు అందరూ అక్కడి నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రగతి భవన్ నుంచే సీఎం రోజువారీ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. సీఎం కోసం ప్రత్యేక ఆఫీసు లేకపోవడంతో.. మెట్రో భవన్‌లోనే చాంబర్ ఏర్పాటు చేయాలంటూ ప్రగతిభవన్ వర్గాలు ఆదేశించినట్టు తెలిసింది. దీంతో సీఎం సమీక్షలు నిర్వహించేందుకు వీలుగా ఈ చాంబర్ నిర్మించారు. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ కంపెనీకి సీఎస్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. చైర్మన్ హోదాలో సీఎస్ కు మెట్రో బిల్డింగ్ లో ఒక చాంబర్ ఉంది. దాన్ని పాత సీఎస్ లు ఎవరూ వాడుకోలేదు. కొత్త సీఎస్ సోమేశ్‌కుమార్.. దాన్ని రెగ్యులర్ గా వాడుకునేలా మార్పులు చేస్తున్నట్టు తెలిసింది.