ఇల్లెందు మున్సిపాలిటీలో ..పొలిటికల్ ​హై టెన్షన్

  •    నేడు  చైర్మన్​పై అవిశ్వాసం
  •     పట్టుకోసం పాకులాడుతున్న బీఆర్​ఎస్.. ‘చే’జిక్కించుకునేందుకు కాంగ్రెస్ స్కెచ్​
  •     మీటింగ్​కు భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశం
  •     19న కొత్తగూడెం మున్సిపాల్​చైర్​ పర్సన్​పై అవిశ్వాసం స్పెషల్ ​మీటింగ్​ 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు :  ఇల్లెందు, కొత్తగూడెం మున్సిపాలిటీల్లో పొలిటికల్​ హై టెన్షన్​ నెలకొంది. ఇల్లెందు మున్సిపల్​ చైర్మన్​పై సోమవారం అవిశ్వాసం స్పెషల్​ మీటింగ్​జరుగనుంది. చైర్మన్​ దమ్మాలపాటి వెంకటేశ్వరరావుపై బీఆర్​ఎస్​ కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాసం రోజుకో మలుపు తిరుగుతోంది. ఏ క్షణంలో ఏ కౌన్సిలర్​ ఏ గ్రూపునకు మారుతడో అర్థం కాని పరిస్థితి నెలకొంది. స్పెషల్​ మీటింగ్​కు భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని శనివారం హైకోర్టు సీఎస్​, డీజీపీ కలెక్టర్, ఎస్పీలను ఆదేశించింది. కొత్తగూడెం మున్సిపాలిటీ చైర్​ పర్సన్​ కాపు సీతాలక్ష్మిపై కూడా19న అవిశ్వాసం స్పెషల్​ మీటింగ్​జరుగనుంది. 

ఆ పార్టీల మధ్య రసవత్తరంగా రాజకీయం.. 

ఇల్లెందు మున్సిపాలిటీలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. బీఆర్​ఎస్​ తరుఫున మున్సిపల్​ చైర్మన్​గా ఉన్న డి. వెంకటేశ్వరరావు అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్​ పార్టీలో చేరారు. దీంతో  చైర్మన్​పై అవిశ్వాసానికి బీఆర్​ఎస్​ కౌన్సిలర్లు రెడీ అయ్యారు. మున్సిపాలిటీలో 24 వార్డులు ఉన్నాయి. బీఆర్​ఎస్​ నుంచి 19 మంది కౌన్సిలర్లు , ముగ్గురు ఇండిపెండెంట్లు, న్యూడెమొక్రసీ, సీపీఐ నుంచి ఒక్కొక్క కౌన్సిలర్​ గెలుపొందారు. ఇందులో కొందరు కాంగ్రెస్​ పార్టీలో  చేరారు. అవిశ్వాసం సందర్భంగా బీఆర్ఎస్​ పార్టీ విప్ ​జారీ చేసింది. పార్టీ నుంచి వెళ్లిపోయిన చైర్మన్​ను గద్దె దించేందుకు బీఆర్​ఎస్​ నేతలు పక్కా ప్లాన్​ చేస్తున్నారు.

చైర్మన్​పై పెట్టిన అవిశ్వాసానికి మద్దతు ఇచ్చే ఒక్కో కౌన్సిలర్​కు దాదాపు రూ. 25లక్షల వరకు ఆఫర్​ ఇస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.  ఇక కాంగ్రెస్​లో చేరిన చైర్మన్​ డి. వెంకటేశ్వరరావు పదవిని కాపాడేందుకు పార్టీ ముఖ్య నాయకత్వం ప్రణాళికలు రచిస్తోంది. అవిశ్వాసానికి మద్దతు తెలిపిన 14 మంది కౌన్సిలర్లు గత వారం రోజులుగా గోవా, కర్నాటక రాష్ట్రాల్లో క్యాంపుల్లో ఉన్నారు.

అవిశ్వాసం సందర్భంగా నిర్వహించనున్న స్పెషల్​ మీటింగ్​కు కనీసం 17 మంది కౌన్సిలర్లు అటెండ్​ కావాల్సి ఉంది. ఈ క్రమంలో 17 మంది మద్దతు తమకుందని చెబుతున్న బీఆర్ఎస్​ లీడర్లకు చెక్​ పెట్టేందుకు కాంగ్రెస్​ పావులు కదుపుతోంది. వారిలో కనీసం ఒకరిద్దరినైనా మీటింగ్​కు రాకుండా చూస్తే కోరం పూర్తి కాదని, దీంతో అవిశ్వాసం నీరు గారే అవకాశం ఉండడంతో ఆ దిశగా చైర్మన్​ వర్గం ఆలోచిస్తోంది. 

హైకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్​ కౌన్సిలర్లు

తమను అధికార కాంగ్రెస్​ పార్టీ లీడర్లు బెదిరిస్తున్నారంటూ అవిశ్వాసానికి సంతకం పెట్టిన పలువురు బీఆర్​ఎస్​ కౌన్సిలర్లు ఇటీవలి హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు విచారించిన హైకోర్టు కౌన్సిలర్లతో పాటు స్పెషల్​ మీటింగ్​ జరిగే ప్రాంతం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. కౌన్సిలర్లకు రక్షణ కల్పించాలని హైకోర్టు సీఎస్​, డీజీపీ, కలెక్టర్, ఎస్పీలకు సూచించింది.  

అవిశ్వాసం నెగ్గేందుకు బీఆర్​ఎస్​ లీడర్లు, అవిశ్వాసం వీగేందుకు కాంగ్రెస్​ లీడర్లు ఎవరికి వారు పెద్ద ఎత్తున పొలిటికల్​ గేమ్​ ఆడుతున్నారు. కౌన్సిలర్ల కిడ్నాప్​లు జరిగే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు. 

కొత్తగూడెంలో హైడ్రామా షురూ..

బీఆర్​ఎస్​కు చెందిన కొత్తగూడెం మున్సిపల్​ చైర్​ పర్సన్​ కాపు సీతాలక్ష్మీపై అదే పార్టీకి చెందిన కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాసంపై 19న స్పెషల్​ మీటింగ్​ జరగనుంది. 36 మందికి గానూ 22 మంది కౌన్సిలర్లు చైర్​ పర్సన్​కు వ్యతిరేకంగా అవిశ్వాసంపై సంతకాలు చేశారు. అవిశ్వాసం నెగ్గేందుకు ఒక గ్రూప్ పావులు కదుపుతుండగా వీగేందుకు చైర్​ పర్సన్​ గ్రూపు ఎత్తులకు పై ఎత్తులు వేస్తుండడం కొత్తగూడెంలో హై డ్రామా నెలకొంది.