పోలీసుల పిల్లల కోసం 50 ఎకరాల్లో యంగ్​ ఇండియా పోలీస్​ స్కూల్​ : మంచిరేవులలో శంకుస్థాపన చేసిన సీఎం

పోలీసుల పిల్లల కోసం 50 ఎకరాల్లో యంగ్​ ఇండియా పోలీస్​ స్కూల్​ : మంచిరేవులలో శంకుస్థాపన చేసిన సీఎం

‘హైదరాబాద్​, వెలుగు:  పోలీసు కుటుంబాల పిల్లల కోసం వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రత్యేకంగా స్కూల్​ అందుబాటులోకి రానుంది. హైదరాబాద్​ మంచిరేవులలోని గ్రేహౌండ్స్ క్యాంపస్ సమీపంలో 50 ఎకరాల్లో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని నిర్మించనుంది.  దీనికి ‘యంగ్​ ఇండియా పోలీస్​ స్కూల్’​గా నామకరణం చేశారు. స్కూల్​ నిర్మాణం కోసం సోమవారం సీఎం రేవంత్​రెడ్డి శంకుస్థాపన చేశారు. ఇందులో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సీఎస్​ శాంతి కుమారి, డీజీపీ జితేందర్, హోం శాఖ సెక్రటరీ రవిగుప్తా, ఇంటెలిజెన్స్ చీఫ్ బి.శివధర్ రెడ్డి, సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్,  అదనపు డీజీపీ (ఆపరేషన్స్) స్టీఫెన్ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.  

వచ్చే విద్యా సంవత్సరం నుంచి..!

పోలీస్ డ్యూటీ మీట్ సందర్భంలో చెప్పినట్టుగానే పోలీసు యూనిఫామ్ కుటుంబాల పిల్లల కోసం ప్రత్యేకంగా ఈ యంగ్​ ఇండియా పోలీస్​ స్కూల్​ ఏర్పాటు కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ వెంటనే సీఎం రేవంత్​రెడ్డి భూమి పూజ నిర్వహించారు. స్కూల్ నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించిన ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. సైనిక్ స్కూల్ తరహాలో దేశంలోనే మొట్టమొదటిదిగా పోలీసు కుటుంబాల పిల్లల కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రత్యేకంగా ఈ స్కూల్​ ఏర్పాటు చేస్తున్నారు. 

ఇందులో స్థానికులకు 10 శాతం మేరకు అడ్మిషన్లు కల్పించాలన్న స్థానిక ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించి ముఖ్యమంత్రి..  15 శాతం అడ్మిషన్లు స్థానికులకు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని వేదికపై మంత్రి శ్రీధర్ బాబు  ప్రకటించారు. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ లో హోంగార్డు నుంచి డీజీపీ వరకు వారి కుటుంబాల పిల్లలందరికీ సమాన అవకాశాలు కల్పిస్తారు. రాష్ట్రంలోని పోలీస్​, ఫైర్, ఎస్పీఎఫ్, జైళ్ల శాఖల ఉద్యోగుల పిల్లల కోసం దీన్ని నెలకొల్పుతున్నారు. మొదటగా 5 నుంచి 8 వ తరగతి వరకు వచ్చే విద్యా సంవత్సరం ఈ స్కూల్ ప్రారంభమవుతుంది.