పండుగాడు ఐదో తరగతి చదువుతున్నాడు. స్కూల్ నుంచి ఇంటికొచ్చాక స్నేహితులతో కలిసి ఆడుకోవడానికి వెళ్లిపోతాడు. ఎప్పుడో రాత్రయ్యాకగానీ ఇంటికి రాడు. సెలవు రోజుల్లో అసలే ఇంటి పట్టున ఉండడు. పండుగాడి అమ్మకి బెంగ పట్టుకుంది. ఓ రోజు బాగా తిట్టింది కూడా. కొద్దిసేపు ఆడుకోడానికి వెళ్తే పర్లేదు కానీ, అస్తమానం బయటికెళ్లి ఆటలంటే భవిష్యత్ చెడిపోతుందని, చదువు రాదని మందలించింది. పండుగాడు గట్టిగా ఏడుస్తూ వీధిలోకి వచ్చాడు. వాడంటే వీధిలోని చాలామందికి ఇష్టం.
ఇరుగు పొరుగున ఉన్నవాళ్లు పండుగాడిని తీసుకొని వాడి ఇంట్లోకి వచ్చారు. పండుగాడి అమ్మతో మాట్లాడుతున్నారు. "చిన్న పిల్లవాడిని అలా అడ్డగోలుగా తిట్టడమే? పాపం పసివాడు. ఏమైపోతాడు. పిల్లలకు ఏదైనా సౌమ్యంగా చెప్పాలి. ఎవరైనా చిన్న పిల్లవాడిని కొడతారా ఎక్కడైనా?” అంది కమల. "పిల్లవాడిని పెంచడం నీకు చేతకాకపోతే నేను తీసుకెళ్ళి పెంచుకుంటా. అభం శుభం తెలియని వాడిని ఇలా తిడతారా?" అంది అమల. "పిల్లలకి ఏదైనా అర్థం అయ్యేట్లు చెబితే వాళ్లే మారతారు.
ALSO READ | Lifestyle: అమ్మమాట వింటే కష్టాలే ఉండవు.. పీత ఎంత సాయం చేసిందో..!
నెమ్మదిగా వాళ్లలో మార్పు తీసుకురావాలి" అంటూ, పండుగాడి వైపు చూసి, “ఒరేయ్ పండు! అమ్మనీ మంచికేగా చెప్పేది. అమ్మ చెప్పినట్లు వినరా, బాగు పడతావు" అంది విమల. వాళ్లూ వీళ్లు వెనకేసుకురావడం వల్ల పండుగాడిలో ఎలాంటి మార్పు రాలేదు. ఓ రోజు ఆదివారం నాడు పొద్దున్నే బయటకు వెళ్ళిన పండుగాడు.. రాత్రి అయ్యాక ఇంటికి వచ్చాడు. పగలంతా కంగారుపడి అంతటా వెతికి, బాగా ఏడ్చిన తల్లి.. పండు ఇంటికి రాగానే బాగా తిట్టింది. ఇక అమ్మ దగ్గర అస్సలు ఉండొద్దని అనుకున్నాడు.
కమల ఆంటీ ఇంటికి వెళ్ళాడు. వాళ్ళింట్లో తన స్నేహితుడు రాంపండు ఏడుపులు వినిపిస్తున్నాయి. వాడేదో తప్పు చేశాడని వాళ్ళమ్మ బాగా కొడుతోంది. 'ఈవిడ చెప్పే నీతులు ఉత్తవేనా' అనుకున్నాడు పండు. అమల ఇంటికి వెళ్లి జరిగింది చెప్పాడు. "మీ ఇంట్లోనే ఎప్పుడూ ఉంటా ఆంటీ" అన్నాడు. "తప్పమ్మా! పండుగాడు- అమ్మ .. -సరికొంద శ్రీనివాసరాజు ఎవరింట్లో వాళ్లే ఉండాలి. వెళ్ళి అమ్మ చెప్పినట్లు విను. నువ్వు మా ఇంట్లో ఉంటే మా వాడూ చెడిపోతాడు" అంది అమల. 'వీళ్ళ ప్రేమలన్నీ వట్టివేనా?' అనుకున్నాడు. పండు. అక్కడ్నుంచి విమల ఇంటికి వెళ్లి జరిగింది చెప్పాడు.
"జన్మలో అమ్మ దగ్గరికి వెళ్ళను. ఇక్కడే ఉంటా" అన్నాడు. “తప్పురా పండు! నిన్ను అమ్మ తప్ప ఎవరూ మంచిగా చూసుకోలేరు. మీ అమ్మ చెప్పినట్లు విను. నువ్వు బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేస్తే నీకు మంచి పేరు వస్తుంది. ఎప్పుడూ స్నేహితులతో ఆటలాడితే వాళ్లు నిన్ను తప్పు దారిలోకి తీసుకెళ్తారు. నువ్వు ఫెయిల్ అయ్యి నీ చదువు మధ్యలో ఆగిపోతే ఏ స్నేహితుడూ నిన్ను దగ్గరికి తీసుకోడు.
ఏ ఆంటీ నిన్ను సమర్థించదు. ఎప్పుడూ నీ గురించి ఆలోచన చేసేది మీ అమ్మే! నువ్వు బాగుపడాలి అని నిన్ను తిడుతుంది. నీపై ఆమెకు ఉన్న ప్రేమ ప్రపంచంలో మరెవ్వరికీ ఉండదు. ఆలోచించు" అన్నది విమల ఆలోచించిన పండుగాదు ఇంటికి వెళ్లి అమ్మతో తనను క్షమించమని వేడుకున్నాడు. ఇకపై అమ్మ చెప్పినట్లు వింటానన్నాడు. సంతోషించి వాణ్ణి దగ్గరకు తీసుకుంది అమ్మ.