హైదరాబాద్: రాజేంద్రనగర్ ఔటర్ రింగ్ రోడ్డుపై కారు బీభత్సం సృష్టించింది. ముందు సరుకులతో వెళుతున్న వాహనాన్ని ఫార్చ్యూనర్ కారు ఢీ కొట్టింది. ఓవర్ స్పీడ్తో ఢీ కొట్టడంతో ప్రమాద తీవ్రతకు సరుకులతో వెళుతున్న ఆ వాహనం బోల్తా పడింది. కారులో ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణం అని పోలీసులు తేల్చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మద్యం మత్తులో కారు నడిపినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. నంబర్ ప్లేట్ ముక్కలైంది. నంబర్ ప్లేట్ చాలా ఫ్యాన్సీగా ఉంది. TG07 HT 2345. ఇదీ ఆ గాడీ నంబర్. ఈ ఫ్యాన్సీ నంబర్ కోసమే కొన్ని లక్షలు చెల్లించి ఉండొచ్చు. కారు నంబర్ చూస్తుంటేనే సిటీలోని సంపన్న కుటుంబాల్లో ఒకరిది అయి ఉండొచ్చని స్పష్టమవుతోంది. హైదరాబాద్లో ఇటీవల కారు ప్రమాదాలు నగరవాసులను బెంబేలెత్తిస్తున్నాయి.
డిసెంబర్ 31న పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ వేపై స్కోడా కారు ఒకటి బీభత్సం సృష్టించింది. మితిమీరిన వేగంతో వెళ్లి ముందు వెళుతున్న కారును ఢీ కొట్టింది. ఈ ఘటనలో రెండు కార్లలో సమయానికి ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. డ్రైవర్లతో పాటు రెండు కార్లలో ఉన్న వాళ్లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అతి వేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు. ఈ కారు ప్రమాదంతో పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ వేపై ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్ను క్లియర్ చేయాల్సిన పరిస్థితులొచ్చాయి. ఈ కారు ప్రమాదంపై రాజేంద్ర నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు.