Viral Video: ఎంత కంగారుపడ్డార్రా.. కాసేపు అల్లకల్లోలం అయిపోయారు జనమంతా.. వీడియో మీరూ చూడండి..!

Viral Video: ఎంత కంగారుపడ్డార్రా.. కాసేపు అల్లకల్లోలం అయిపోయారు జనమంతా.. వీడియో మీరూ చూడండి..!

బెంగళూరు: సుమోల ఛేజింగ్లు, గాల్లో పల్టీ కొట్టడాలు వి.వి.వినాయక్ సినిమాల్లో చూసి ఉంటారు. సుమోలు కాదు గానీ బెంగళూరులో ఒక వాటర్ ట్యాంకర్ సినీ ఫక్కీలో పల్టీలు కొట్టింది. సినిమాల్లో మాత్రమే కనిపించే సన్నివేశం రోడ్డు మీదే కనిపించేసరికి ఆ రోడ్డు మీద వెళుతున్న వాహనదారులకు చెమటలు పట్టినంత పనయింది. అసలేం జరిగిందంటే.. బెంగళూరులోని దొమ్మసంద్ర వర్తూర్ మెయిన్ రోడ్లో ఒక వాటర్ ట్యాంకర్ బీభత్సం సృష్టించింది.

ముందు వెళుతున్న వాహనాలను ఓవర్ టేక్ చేసే క్రమంలో అతి వేగంగా వెళ్లిన వాటర్ ట్యాంకర్ అదుపు తప్పింది. దీంతో.. ఆ వాటర్ ట్యాంకర్ పల్టీల మీద పల్టీలు కొట్టింది. దొర్లుకుంటూ రోడ్డుపై తిరగబడింది. స్థానికులు గమనించి ఆ వాటర్ ట్యాంకర్ డ్రైవర్ను కాపాడారు. బతికే ఉన్నాడు కానీ స్పృహలో లేకపోవడంతో అతనిని ఆసుపత్రికి తరలించారు. ర్యాష్ డ్రైవింగ్కు, అతి వేగంతో ఇతరులను ప్రమాదంలో పడేస్తున్న ఘటనలకు ఈ ఉదంతం సాక్ష్యంగా నిలిచింది.

వాటర్ ట్యాంకర్ పల్టీలు కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. బిజీ రోడ్డు కాదు కాబట్టి సరిపోయింది గానీ బెంగళూరు సిటీలో ఈ ఘటన జరిగి ఉంటే ముందున్న వాహనాలు, వెనుక వస్తున్న వాహనాలు ఆ వాటర్ ట్యాంకర్ డ్రైవర్ నిర్లక్ష్యానికి బలై ఉండటం ఖాయం. దొమ్మసంద్ర వర్తూర్ మెయిన్ రోడ్లో కూడా ఎప్పుడూ ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో కావడంతో వాహనాల తాకిడి కాస్త తక్కువగా ఉంది. వాటర్ ట్యాంకర్ ముందు వెళుతున్న కారు డ్రైవర్కు త్రుటిలో ప్రమాదం తప్పింది. వీడియో వైరల్ అవడంతో ఈ ఘటనపై బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు విచారణ జరుపుతున్నారు.