నీటికోసం  బావిలో పడ్డ చుక్కల దుప్పి

కోనరావుపేట, వెలుగు : దాహం తీర్చుకోవడానికి వచ్చిన ఓ చుక్కల దుప్పి నీళ్లు లేని వ్యవసాయ బావిలో పడింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మరిమడ్ల అటవీ ప్రాంతం నుంచి సోమవారం ఓ చుక్కల దుప్పి సమీపంలోని వ్యవసాయ భూముల్లోకి వచ్చింది.

నీరు తాగేందుకు ప్రయత్నించి బావిలో పడింది. స్థానిక రైతులు ఫారెస్ట్​ ఆఫీసర్లకు సమాచారమిచ్చారు. వారు అక్కడికి చేరుకొని దుప్పిని సురక్షితంగా బయటకు తీసి అడవిలో వదిలిపెట్టారు. వేసవి సమీపిస్తుండడంతో వన్యప్రాణులు జనావాసాల్లోకి వస్తున్నాయని, వాటికి ఎలాంటి హాని చేయొద్దని ఫారెస్ట్​ ఆఫీసర్లు సూచించారు.