Jehanabad: బీహార్లో పెను విషాదం.. ఆలయంలో తొక్కిసలాట.. ఏడుగురు మృతి

పాట్నా: బీహార్లో ఘోరం జరిగింది. జహనాబాద్ జిల్లాలో బాబా సిద్ధార్థ్ ఆలయంలో తొక్కిసలాట జరిగి ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. తొమ్మిది మంది భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను జహనాబాద్, మఖ్దుంపూర్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సోమవారం ఉదయం ఈ ఘటన జరిగింది. చనిపోయిన వారిలో ఐదుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. ‘సావన్’ నెలలో చివరి సోమవారం కావడంతో బాబా సిద్ధార్థ్ ఆలయానికి భక్తులు పోటెత్తారు. పెద్ద ఎత్తున భక్తులు రావడంతో తోపులాట జరిగింది. ఈ ఘటనపై జహనాబాద్ జిల్లా మేజిస్ట్రేట్ అలంకృత పాండే మాట్లాడుతూ.. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని చెప్పారు.

 

ఉత్తరప్రదేశ్​లో గత జులైలో ఇదే తరహాలో ఘోర విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. వేలాది మంది హాజరైన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో తీవ్రమైన రద్దీ కారణంగా తొక్కిసలాట జరగడంతో 116 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మృతుల్లో ఏడుగురు చిన్నారులు, 108 మంది మహిళలు ఉన్నారు. వందలాది మంది భక్తులు గాయపడ్డారు. యూపీలోని హత్రాస్ జిల్లా ఫూల్ రాయ్ గ్రామం వద్ద నిర్వహించిన భోలే బాబా సత్సంగ్ కార్యక్రమంలో ఈ పెను విషాదం జరిగింది. వందకుపైగా ప్రాణాలను బలితీసుకున్న ఈ ఘటనకు రకరకాల కారణాలు వినిపించాయి. కార్యక్రమం ముగిసిన వెంటనే బాబా వెళ్లిపోతుండగా ఆయనతో ఫొటో దిగేందుకు, బాబా కాళ్లు మొక్కేందుకు జనం ఎగబడ్డారని, బురద నేలపై కొందరు జారిపడటంతో తొక్కిసలాట మొదలైందని.. ఇలా రకరకాలుగా చెప్పారు.