బకెట్ దందాతో ప్రభుత్వ ఖజానాకు నష్టం

బకెట్ దందాతో ప్రభుత్వ ఖజానాకు నష్టం

బషీర్ బాగ్, వెలుగు: బకెట్ దందాతో ప్రభుత్వ ఖజానాకు చిల్లు పడుతోందని తెలంగాణ మైన్స్ అండ్ సాండ్ లారీ అసోసియేషన్ డిమాండ్ చేసింది. హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఇసుక యజమానుల సమస్యలు.. ప్రభుత్వ వైఖరిపై రాష్ట్ర సదస్సు జరిగింది. అసోసియేషన్ అధ్యక్షుడు సుర్వి దామోదర్ గౌడ్ మాట్లాడుతూ.. బకెట్ దందా (ఎక్కువ ఇసుక లోడ్​ చేయడం) వల్ల ఏడు నుంచి పది టన్నుల అధిక లోడుతో నింపేస్తున్నారని, దీంతో ఆర్టీఏ, మైనింగ్, విజిలెన్స్ దాడులు చేసి రూ. లక్షలు చలానాలు వేయడమే కాకుండా కేసులు నమోదు చేస్తున్నారన్నారు.

క్వారీల్లో సరైన తూకం లేక బయట తూకం చూసుకునే పరిస్థితి రావడం వల్ల 10, 20 కిలోమీటర్లు రాకముందే తమపై ఆర్టీఏ దాడులు చేస్తోందన్నారు. భూపాలపల్లి, ములుగు, పెద్దపల్లి జిల్లాలో ఇది ఎక్కువగా ఉందన్నారు. ప్రభుత్వం లోడింగ్ వ్యవస్థను బలోపేతం చేసి అక్రమ కేసులు నుంచి తమను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ యాదగిరి గౌడ్, జనరల్ సెక్రెటరీ పవన్ కళ్యాణ్ రెడ్డి, సలీం, జగదీష్ యాదవ్, రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.