- తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడు
- వర్ధంతి వేడుకల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమురయ్య విగ్రహం హైదరాబాద్‌లో లేకపోవడం బాధాకరమని ఆర్ అండ్ బీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి హైదరాబాద్‌లో దొడ్డి కొమురయ్య విగ్రహం ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు. తెలంగాణ సాధించి పదేండ్లు అయినా గత ప్రభుత్వం విగ్రహం ఏర్పాటు చేయలేదన్నారు. గురువారం రవీంద్ర భారతిలో జరిగిన దొడ్డి కొమురయ్య వర్ధంతి ప్రోగ్రామ్‌లో విప్ బీర్ల ఐలయ్యతో కలిసి మంత్రి వెంకట్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.
‘‘గత బీఆర్ఎస్ ప్రభుత్వం.. ఉద్యమాలు, ఉద్యమకారులను నిర్లక్ష్యం చేసింది. తెలంగాణ రాష్ట్ర సాధనకు ఆ నాటి దొడ్డి కొమురయ్య పోరాటమే స్ఫూర్తి. నిజాం నిరంకుశత్వానికి.. దేశ్‌ముఖ్‌ల వెట్టికి.. ఆగడాలకు వ్యతిరేకంగా పోరాడి వీరమణం పొందిన వీరుడు దొడ్డి కొమురయ్య. ఆ నాడు దేశమంతా స్వాతంత్ర్య సంబరాల్లో మునిగిపోతే.. మన ప్రాంతం నిజాం పాలనలో మగ్గిపోవడం ఇష్టం లేక వీరోచితంగా పోరాడారు’’అని అన్నారు. తెలంగాణ చరిత్ర ఉన్నంత వరకు దొడ్డి కొమురయ్య కీర్తి సజీవంగా ఉంటుందన్నారు.
ఆంధ్ర మహాసభ సందేశంతో యువకులంతా ఒక్కటై ఉద్యమిస్తుంటే.. నిజాం సేనలు తట్టుకోలేక ఉద్యమకారులపై కాల్పులు జరిపారని, అప్పుడే దొడ్డి కొమురయ్య అమరుడయ్యారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశం, బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్, కమిషనర్ బాలమాయా దేవి, చంద్రశేఖర్, అలోక్ కుమార్, మల్లయ్యభట్టుతో పాటు వివిధ బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డితో కలిసి జనగామలోనూ దొడ్డి కొమురయ్య వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళ్లెం కమాన్‌వద్ద స్థానిక కురుమ సంఘం ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు.
అసెంబ్లీలో దొడ్డి కొమురయ్య వర్ధంతి
సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య వర్ధంతి కార్యక్రమాన్ని గురువారం అసెంబ్లీ లాబీలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, లేజిస్లేచర్ సెక్రటరీ నరసింహాచార్యులు తదితరులు పాల్గొన్నారు. దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.