
- రెండు కారిడార్ల మధ్య తొలగించాల్సిన చెట్లను గుర్తించిన హెచ్ఎండీఏ
- సంస్థల నుంచి టెండర్ల ఆహ్వానం
- రూ.7.27 కోట్లు ఖర్చవుతుందని అంచనా
హైదరాబాద్సిటీ, వెలుగు:
హెచ్ఎండీఏ ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టులో ముందడుగు పడింది. ఈ ప్రాజెక్టు నిర్మించే ప్రాంతాల్లో రోడ్లకు రెండువైపులా భారీ సంఖ్యలో చెట్లు అడ్డు వస్తుండడంతో, వాటిని ట్రాన్స్లొకేట్చేయాలని హెచ్ఎండీఏ నిర్ణయించింది. ఈ పద్ధతిలో అవసరమైన చెట్లను, వృక్షాలను పెకిలించి వేరే ప్రాంతాలకు తీసుకువెళ్లి నాటుతారు. దీనికి సుమారు రూ. ఏడు కోట్లకుపైగా ఖర్చవుతుందని అధికారులు తెలిపారు.
ఎలివేటెడ్కారిడార్ ప్రాజెక్టులో భాగంగా ప్యారడైజ్నుంచి బోయిన్పల్లి డెయిరీఫామ్రోడ్ (5.32 కి.మీ.)వరకు డబుల్ డెక్కర్పద్ధతిలో ఒక ఫ్లై ఓవర్, జేబీఎస్నుంచి శామీర్పేట (18.12 కి.మీ.) వరకు 3,812 కోట్లతో మరో ఫ్లై ఓవర్నిర్మించనున్నారు. ఈ క్రమంలో ఈ రూట్లో అడ్డు వచ్చే చెట్లను నరికివేయకుండా ట్రాన్స్లొకేట్చేయాలని చేయబోతున్నారు. దీని కోసం తాజాగా టెండర్లు పిలిచినట్టు అధికారులు తెలిపారు.
తొలగించాక..పెరిగేవరకూ వారిదే బాధ్యత
ఎలివేటెడ్కారిడార్కు అడ్డు వస్తున్న చెట్లపై హెచ్ఎండీఏలోని అర్బన్ఫారెస్ట్రీ అధికారులు సర్వే చేశారు. ఇందులో జేబీఎస్నుంచి శామీర్పేట రూట్లో ఆల్వాల్, తూంకుంట ప్రాంతాల్లో 3,272 చెట్లు, ప్యారడైజ్నుంచి శామీర్పేట దారిలో ఓఆర్ఆర్ వరకు...ఆల్వాల్, తూంకుంటలలో 395, ప్యారడైజ్జంక్షన్ నుంచి డెయిరీఫామ్ రోడ్లో వయా తాడ్బండ్, బోయిన్పల్లి మధ్య 515 చెట్లు, డెయిరీఫామ్వయా తాడ్బండ్, బోయిన్పల్లిలో 78 చెట్లు ఉన్నట్టు గుర్తించారు. రెండు కారిడార్లలో మొత్తం 4230 చెట్లను తొలగించేందుకు కొన్ని సంస్థల నుంచి టెండర్లను ఆహ్వానించారు.
ఎంపికైన సంస్థ ఒక్కో చెట్టును తొలగించి మరో చోట నాటడంతో పాటు ఆ చెట్లు పాదుకునే వరకూ అవసరమైన సంరక్షణ పనులు చేయాల్సి ఉంటుంది. నీళ్లు పోయడం, ఎరువులు వేయడం, సూపర్ విజన్తదితర పనులు కాట్రాక్టు సంస్థ చేయాలి. చెట్లు పాడవకుండా మనుగడ సాగిస్తేనే బిల్లులు చెల్లించేలా ఒప్పందం చేసుకోనున్నారు. ఒక్కో చెట్టు సైజును బట్టి తొలగించి వేరే చోట నాటాలంటే రూ.7 వేల నుంచి రూ.25వేల వరకు ఖర్చు వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ఈ ప్రాజెక్టుకు 7.27 కోట్ల వరకు ఖర్చుకాగలవని భావిస్తున్నారు. ఈ పనులను హెచ్ఎండీఏలోని ఇంజినీరింగ్, అర్బన్ఫారెస్ట్ విభాగం పర్యవేక్షించనున్నది.