కొన్ని సందర్భాల్లో టెక్నాలజీని నమ్మడం కంటే..మనుషుల్ని నమ్ముకోవడం బెటర్ అని పిస్తోంది. ఎందుకంటే ఈ మధ్యన దూర ప్రాంతాలకు వెళ్లే వాహనదారులు గుడ్డిగా జీపీఎస్ ను ఫాలో అవుతూ తప్పుడు మార్గాలతో ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని సార్లు ప్రాణాల మీదకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి.
ఇటీవల కర్నాటకకు చెందిన ఓ ఫ్యామిలీ అడ్రస్ కోసం గూగుల్ మ్యాప్స్‌పై ఆధారపడిన ఒక SUV డ్రైవర్ తమిళనాడులోని కొండల పట్టణమైన గూడలూర్‌లోని మెట్ల సముదాయంలో చిక్కుకుపోయాడు. గతేడాది అక్టోబర్ గూగుల్ మ్యాప్ ను నమ్ముకుని కేరళలోని ఓ నదిలో కారు మునిగిపోవడంతో ఇద్దరు వైద్యులు మరణించారు. ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. తెలంగాణలోనూ ఓ లారీ డ్రైవర్ నదిలో ఇరుక్కుపోయాడు. లేటెస్ట్ గా థాయిలాండ్ లో ఓ యువతి జీపీఎస్ సాయంతో కారు డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లి నదిపై ఉన్న బ్రిడ్జి మధ్యలో ఇరుక్కుపోయింది.
థాయిలాండ్ లోని ఖై జిల్లాకు చెందిన ఓ మహిళ నాంగ్ మువాంగ్ జనవరి 28న సాయంత్రం సంగ్ మెన్ లోని తన తన ఫ్రెండ్ ను కలిసేందుకు బయల్దేరింది. ఆ ప్రాంతం గురించి తెలియకపోవడంతో జీపీఎస్ ఆన్ చేసుకుంది. గూగుల్ రూట్ మ్యాప్ ఆధారాంగా మార్గ మధ్యలో ఓ పొడవైన చెక్క వంతనపై వెళ్లి ఇరుక్కుపోయింది. దాదాపు 120 మీటర్ల పొడవైన బ్రిడ్జి అది. కేవలం కాలి నడకన నడిచేవాళ్ల కోసం ఆ బ్రిడ్జిని కట్టారు. వాహనాలకు అనుమతి లేదు. అయితే జీపీఎస్ అదే మార్గాన్ని చూపించడంతో కారు బ్రిడ్జిపై దాదాపు 15 మీటర్ల వరకు వెళ్లింది. మధ్యలో కారు లెఫ్ట్ వీల్ ఇరుక్కపోవడంతో ఆగిపోయింది.
మహిళ బయటకు దిగి సాయం కోసం అరవడంతో దగ్గరలో అటుగా వెళుతున్న ఓ వ్యక్తి రెస్క్యూ సిబ్బందికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. వెంటనే ఘటనా స్థలానికి వచ్చిన రెస్క్యూ సిబ్బంది కారుకు, ప్రమాదం జరగకుండా బయటకు తీశారు. అయితే తాను ఆ ప్రదేశానికి ఎప్పుడు వెళ్లలేదని ఆ మహిళా డ్రైవర్ తెలిపింది. పూర్తిగా జీపీఎస్ పైనే ఆధారపడి కారు డ్రైవ్ చేశా..ఆ బ్రిడ్జి దృడంగా ఉందనుకున్నా.. కారు మధ్యలో ఇరుక్కుపోయే సరికి చాలా భయపడ్డ..అని ఆ మహిళ మీడియాతో వెల్లడించింది.