
- చంపిన పట్టించుకోరా? అని పేరెంట్స్ ధర్నా
శాయంపేట, వెలుగు: హనుమకొండ జిల్లా శాయంపేట మండలకేంద్రంలోని మహాత్మా జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న స్టూడెంట్‌పై తోటి స్టూడెంట్ దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి.. భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం నిజాంపల్లి గ్రామానికి చెందిన కర్రే అశోక్ సువర్ణ కొడుకు అభిలాష్ శాయంపేట ఎంజేపీలో ఆరో తరగతి చదువుతున్నాడు. ఎలర్జీ రావడంతో ట్రీట్మెంట్ చేయించి గత సోమవారం పాఠశాలలో చేర్పించారు. రెండో ఆదివారం(13న) విజిటింగ్ ఉండడంతో కొడుకును చూడడానికి వచ్చారు. అతడి ముఖంపై, వీపు, భుజంపై గాట్లు, కొరికిన గుర్తులు ఉండడంతో అతడిని టీచర్ల వద్దకు తీసుకెళ్లి నిలదీశారు.
వారు అభిలాష్ ను బుజ్జగించి అడగగా పాఠశాలలో రాత్రి తాను పడుకోగా ఓ తోటి విద్యార్థి ఇక్కడ ఎందుకు పడుకుంటున్నావని, తన వాచ్ ఎందుకు ఖరాబ్ చేశావని ప్రశ్నిస్తూ మంగళవారం రాత్రి తనపై దాడి చేసి కొరుకుతూ, గిచ్చుతూ కొట్టి గాయపరిచాడని తెలిపాడు. దీంతో తమ కొడుకును కొట్టి చంపిన ఇంతేనా అంటూ ప్రిన్సిపల్‌పై పేరెంట్స్ మండిపడ్డారు. ఇంత జరిగినా తమకెందుకు సమాచారం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల మెట్లపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ప్రిన్సిపల్ రాజ్ కుమార్ దీనిపై స్పందిస్తూ రేవంత్ తల్లిదండ్రులతో మాట్లాడి సదరు స్టూడెంట్‌కు టీసీ ఇచ్చి పాఠశాల నుంచి పంపించి వేస్తానని హామీ ఇచ్చారు.