
- వికారాబాద్ జిల్లా మంచన్‌పల్లిలో విషాదం
- బాత్రూంలో అడ్డదిడ్డంగా విద్యుత్ తీగలు
- అవి తగిలి అక్కడికక్కడే కుప్పకూలిన తొమ్మిదేండ్ల చిన్నారి
- న్యాయం చేయాలంటూ స్థానికుల ధర్నా
పరిగి, వెలుగు : ప్రభుత్వ స్కూల్ బాత్రూంలో వేలాడుతున్న కరెంట్ వైర్లు తగిలి ఓ విద్యార్థిని చనిపోయింది. ఈ విషాద ఘటన వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మంచన్ పల్లి గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన నరసింహ, లక్ష్మీ దంపతుల చిన్న కూతురు దీక్షిత (9) స్థానిక గవర్నమెంట్ స్కూల్లో నాలుగో తరగతి చదువుతున్నది. సోమవారం ఉదయం బడికి వెళ్లింది. 10.30 గంటలకు పాప బాత్రూంకు వెళ్లగా.. అక్కడ వేలాడుతున్న కరెంట్ వైర్లు కాలికి తగిలాయి. వాటిని చేతితో తీస్తుండగా.. కరెంట్ షాక్ కొట్టి కుప్పకూలిపోయింది. తోటి స్టూడెంట్లు గమనించి స్కూల్ హెడ్ మాస్టర్ సంతోష్ కుమార్‌కు విషయం చెప్పారు. హెడ్ మాస్టర్ అక్కడికి చేరుకుని దీక్షితను అందుబాటులో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్‌కు చూపించారు. పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్ చెప్పడంతో వెంటనే కారులో పరిగిలోని హాస్పిటల్ కు తరలించారు.
మార్గమధ్యలోనే పాప చనిపోయిందని డాక్టర్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. దీక్షిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ బంధువులు, గ్రామస్తులు పరిగి ప్రభుత్వాసుపత్రి వద్ద రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. న్యాయం చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు డీఎస్పీ కరుణ సాగర్ రెడ్డి చెప్పడంతో వారు ధర్నాను విరమించారు.
కాంట్రాక్టర్ నిర్లక్ష్యం
‘మన ఊరు– మనబడి’ పథకం కింద గతంలో మంచనపల్లి ప్రభుత్వ స్కూల్ ఎంపికైంది. స్కూల్ చైర్మన్ నరేశ్ ‘మన ఊరు మన బడి’ కాంట్రాక్టు పనులు చేస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. ఈ స్కూల్ కు విద్యుత్ మీటర్ లేదు. పక్కనే ఉన్న గ్రామ పంచాయతీ బోరు మోటార్‌తో అనుసంధానం చేసుకొని కరెంట్‌ను స్కూల్‌కు వాడుతున్నారు. బోరు మోటర్ స్టార్టర్ స్కూల్ బాత్రూంలో ఉండేది. ఇటీవల స్టార్టర్‌ను ఎవరో ఎత్తుకెళ్లడంతో .. వైర్లన్నీ వేలాడుతున్నాయి. వాటిని కాంట్రాక్టర్ తొలగించకపోవడంతో చిన్నారి షాక్‌కు గురై చనిపోయిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని స్కూళ్లను ఎంఈవో సరిగ్గా తనిఖీ చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. దీక్షిత తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై విట్టల్ రెడ్డి చెప్పారు