హాస్టల్‌ బిల్డింగ్‌ పై నుంచి పడి విద్యార్థిని మృతి

హాస్టల్‌ బిల్డింగ్‌ పై నుంచి పడి విద్యార్థిని మృతి

జహీరాబాద్, వెలుగు: హాస్టల్‌ బిల్డింగ్‌‎పై నుంచి పడి ఓ స్టూడెంట్‌ చనిపోయింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ మండలం బూచ్‌నెల్లి మైనార్టీ గురుకుల స్కూల్‌లో ఆదివారం వెలుగు చూసింది. జహీరాబాద్‌ టౌన్ జమాల్‌కాలనీకి చెందిన షేక్‌ హఫీజ్‌ హుస్సేన్‌, మహ్మదీ బేగంల కూతురు సాదియా (14) రెండేండ్ల కింద బూచ్‌నెల్లి మైనార్టీ గురుకులంలో చేరింది.

ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతోంది. శనివారం రాత్రి భోజనం చేసిన అనంతరం తన రూమ్‌కు వెళ్తుండగా ప్రమాదవశాత్తు జారి రెయిలింగ్‌ పైనుంచి కిందపడింది. తలకు తీవ్ర గాయం కావడంతో హాస్టల్‌ సిబ్బంది వెంటనే జహీరాబాద్‌ పట్టణంలోని ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో సికింద్రాబాద్‌ గాంధీ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. 

అక్కడ ట్రీట్‌మెంట్‌ తీసుకుంటూ ఆదివారం చనిపోయింది. సాదియా తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చిరాగ్‌పల్లి ఎస్సై రాజేందర్‌రెడ్డి తెలిపారు. స్టూడెంట్‌ మృతి విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మాణిక్‌రావు, డీసీఎంస్‌ చైర్మన్‌ శివకుమార్‌ హాస్టల్‌ వద్దకు వెళ్లి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. స్టూడెంట్‌ కుటుంబసభ్యులకు ప్రభుత్వం తరఫున ఎక్సేగ్రేషియా చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు.