స్టూడెంట్​ అనుమానాస్పద మృతిపై అనుమానాలు..

  • ఆందోళనకు దిగిన కుటుంబ సభ్యులు
  • హాస్టల్ సిబ్బందే హత్య చేశారని ఆరోపణ
  • రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్​లో ఘటన

అబ్దుల్లాపూర్​మెట్, వెలుగు:   అనుమానాస్పద స్థితిలో 8 వ తరగతి బాలుడు మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా  అబ్దుల్లాపూర్ మెట్ మహాత్మ జ్యోతిరావు ఫూలే బీసీ గురుకుల పాఠశాలలో చోటుచేసుకుంది. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం జై కేసారం గ్రామానికి చెందిన పందుల శ్రీధర్, ప్రసన్న దంపతులకు ఇద్దరు కూతుర్లు, ఓ కొడుకు ఉన్నారు. కొడుకు రంజిత్(13) 8వ తరగతి చదువుతున్నాడు. గతంలో రంజిత్ పెద్దకంచర్లలోని మహాత్మ జ్యోతిరావుఫూలే రెసిడెన్షియల్​లో చదవగా.. సోమవారమే అతను అబ్దుల్లాపూర్​మెట్​లోని మహాత్మ జ్యోతిరావుఫూలే రెసిడెన్షియల్​లో చేరాడు.  సోమవారం రాత్రి పేరెంట్స్ తో మాట్లాడిన రంజిత్.. మంగళవారం ఉదయం ఓ రూమ్​లో చలనం లేకుండా పడి ఉన్నాడు. గమనించిన హాస్టల్ సిబ్బంది అతడిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే బాలుడు చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. దాంతో హాస్టల్ సిబ్బంది విషయాన్ని రంజిత్ పేరెంట్స్ తోపాటు పోలీసులకు తెలియజేశారు.

ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు.. డెడ్ బాడీని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కొడుకు మరణ వార్తను విన్న పేరెంట్స్ బంధువులు, గ్రామస్తులతో కలిసి హాస్టల్ వద్దకు చేరుకున్నారు. అక్కడ బాలుడు కనిపించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. వారు డెడ్​బాడీని ఉస్మానియాకి తరలించినట్లు చెప్పారు. దాంతో ఆగ్రహానికి గురైన రంజిత్ పేరెంట్స్, బంధువులు, గ్రామస్తులు హాస్టల్ వద్దకు చేరుకొని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. హాస్టల్ ప్రిన్సిపల్, వార్డెన్ నిర్లక్ష్యం వల్లే రంజిత్ మృతి చెందాడని మండిపడ్డారు. అతనిది ఆత్మహత్య అని హాస్టల్ సిబ్బంది చెబుతున్నారని.. అది ఆత్మహత్య కాదని హత్యేనని ఆరోపించారు. కారకులపై కఠిన చర్యలు తీసుకొని కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తాము రాకముందే తమ కొడుకు మృతదేహాన్ని ఉస్మానియాకు ఎలా తరలిస్తారని పోలీసులను ప్రశ్నించారు. పరిస్థితి చేయిదాటిపోవడంతో బీసీ వెల్ఫేర్ ఉన్నతాధికారులు హాస్టల్ వద్దకు చేరుకున్నారు. న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో బాధితులు ఆందోళన విరమించారు. పొలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.