- కడుపునొప్పి వస్తే దవాఖానకు తీసుకువెళ్తున్నామన్న మేనేజ్మెంట్
- తర్వాత ఉరి వేసుకుందన్న యాజమాన్యం
- కాలేజీలో ఫర్నిచర్ ధ్వంసం
హనుమకొండ, వెలుగు : హనుమకొండలోని నక్కలగుట్ట వైబ్రాంట్ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న ఓ విద్యార్థిని హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపూర్‌కు చెందిన భవాని వైబ్రాంట్ అకాడమీ జూనియర్ కాలేజీలో ఎంపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. కొద్దిరోజుల కింద హాస్టల్ కి హోమ్ సిక్ హాలిడేస్ ఇవ్వగా..ఈ నెల 27న భవానీని ఆమె తల్లిదండ్రులు హాస్టల్‌కు తీసుకొచ్చి దిగబెట్టారు.
బుధవారం రాత్రి పదకొండున్నర గంటలకు ఉరేసుకోగా, ఒంటి గంటకు కాలేజీ యాజమాన్యం భవాని తల్లిదండ్రులు జనార్ధన్ రెడ్డి, సుమతి రెడ్డిలకు ఫోన్ చేసి భవాని కడుపునొప్పితో బాధపడుతోందని, రోహిణి దవాఖానకు తీసుకెళ్తున్నట్టు సమాచారం ఇచ్చారు. తర్వాత ఎంజీఎంకు తర లించినట్టు చె ప్పారు. తర్వాత భవాని బెడ్ షీట్ తో ఉరేసుకుందని అసలు గుట్టు విప్పారు. దీంతో భవాని పేరెంట్స్, బంధువులు, విద్యార్థి సంఘాల లీడర్లు గురువారం ఉదయం హాస్టల్‌కు వచ్చారు.
మృతికి యాజమాన్యమే బాధ్యత వహించాలంటూ ఫర్నిచర్ ధ్వంసం చేశారు. సుబేదారి, హనుమకొండ పోలీసులు వచ్చి బాధిత కుటుంబసభ్యులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. హనుమకొండ ఏసీపీ దేవేందర్ రెడ్డి వచ్చి ఇరువర్గాలతో మాట్లాడారు. దీంతో ఆందోళన విరమించారు. భవాని మృతదేహానికి పోస్ట్‌మార్టం తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించారు.