హనుమకొండ జిల్లా : తల్లీదండ్రుల తరువాతీ స్ధానం గురువులదే. అలాంటి గురువులే విద్యార్ధుల పాలిట భటులుగా మారుతున్నారు. పిల్లలను ప్రేమగా చూసుకోవాల్సిన కొంతమంది గురువులు పిల్లల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. చిన్న చిన్న తప్పులకు కూడా కఠిన శిక్షలు వేస్తున్నారు. కానీ, ఇక్కడ మాత్రం ఏ తప్పు చేయని ఓ విద్యార్థిని ప్రిన్సిపల్ ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని వాతలు వచ్చేలా కొట్టాడు.
అసలేం జరిగింది..?
బాధితుల కథనం ప్రకారం.. హనుమకొండ జిల్లాలోని కమలాపూర్ మహాత్మా జ్యోతిబా పూలే బాలుర గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి 10వ తరగతి చదువుతున్నాడు. గురుకుల పాఠశాల్లోనే ఉంటూ చదువుకుంటున్నాడు. హాస్టల్ లో వంట పని చేసే ఓ వ్యక్తి సెల్ ఫోన్ చోరీకి గురైంది. ఆ సెల్ ఫోన్ ను విద్యార్థే తీశాడని ప్రిన్సిపల్ వెంకటరమణకు ఎవరో చెప్పడంతో సదరు విద్యార్థిని, అతడి తల్లిని పిలిపించాడు. తల్లి ముందే విద్యార్థిని ప్రిన్సిపల్ విచక్షణ రహితంగా కొట్టాడు. తమ కుమారుడు సెల్ ఫోన్ దొంగతనం చేయలేదని చెప్పినా ప్రిన్సిపల్ వినలేదని, కోపంతో తమ కుమారుడిని బూటు కాళ్లతో తన్నాడని బాధితుడి తల్లి ఆరోపించింది. తమ కుమారుడిని కొట్టొద్దని కాళ్లపై పడి వేడుకున్నా అసలు వినిపించుకోలేదని వాపోయింది.
అసలు విషయం తెలుసుకున్న తర్వాత ప్రిన్సిపల్ తన తప్పును ఒప్పుకున్నాడని బాధితుడి తల్లి చెప్పింది. తనకు కొంతమంది తప్పుడు సమాచారం అందించారని, దాంతో సెల్ ఫోన్ చేశాడనే అనుమానంతో అతడిని కొట్టినట్లు ప్రిన్సిపల్ చెప్పాడని మీడియా ప్రతినిధుల వద్ద కన్నీటి పర్యంతమైంది. ప్రిన్సిపల్ తీరుపై విద్యాశాఖ ఉన్నతాధికారులకు విద్యార్థి తల్లి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.