ప్లాస్టిక్ బాటిల్స్లో నీళ్లు నింపుకుని అదేపనిగా తాగొద్దని ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉన్న వాళ్లు పదేపదే చెప్తుంటారు. కానీ.. ఈ సూచనను ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ.. ప్లాస్టిక్ బాటిల్స్లో తాగడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని ఆస్ట్రియాకు చెందిన డానుబే ప్రైవేట్ యూనివర్సిటీ స్టడీలో తేలింది. ప్లాస్టిక్ బాటిల్స్లో నీళ్లు తాగడం వల్ల బీపీ పెరుగుతుందని ఈ అధ్యయనంలో వెల్లడైంది. ప్లాస్టిక్ బాటిల్స్లో నీళ్లు తాగడం వల్ల మైక్రోప్లాస్టిక్స్ రక్తంలో కలుస్తున్నాయని, ఈ కారణంగా బీపీ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఈ అధ్యయనం తెలిపింది. ప్లాస్టిక్ బాటిల్స్లో కాకుండా వేరే వాటిలో ద్రవాలు తీసుకున్న వారిలో బీపీ తక్కువగా ఉందని పేర్కొంది.
ప్లాస్టిక్ బాటిల్స్ లో నీళ్లను ఎక్కువగా తాగడం వల్ల హార్మోన్ల అసమతుల్యత, హృదయ సంబంధ సమస్యలు, క్యాన్సర్ ప్రమాదం కూడా ఉందట. ప్యాకేజ్డ్ బాటిల్స్లోని ఫ్లుయిడ్స్ తీసుకోవడం వల్ల ఒక వారంలో 5 గ్రాముల మైక్రోప్లాస్టిక్స్ మనిషి శరీరంలోకి వెళుతున్న పరిస్థితి ఉందని తెలిసింది. మైక్రోప్లాస్టిక్స్ శరీరంలోకి వెళ్లకుండా ఉండాలంటే నీళ్లను వేడి చేసుకుని, గోరువెచ్చని నీటిని తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇలా చేస్తే 90 శాతం వరకూ మైక్రోప్లాస్టిక్స్ శరీరంలోకి వెళ్లకుండా నియంత్రించే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఇండియాలో విక్రయిస్తున్న ఉప్పు, చక్కెరలో మైక్రోప్లాస్టిక్స్ ఉన్నాయని ఇటీవల ఒక స్టడీలో తేలిన సంగతి తెలిసిందే. కాకపోతే.. ఈ మైక్రోప్లాస్టిక్స్ రకరకాల రూపాల్లో ఉందని వెల్లడైంది. ఫైబర్, పెల్లెట్స్.. ఇలా ఉప్పు, చక్కెరలో మైక్రోప్లాస్టిక్స్ ఉన్నాయని తేలింది. ఈ మైక్రోప్లాస్టిక్స్ పరిమాణం 0.1 నుంచి mm 5 mm వరకూ ఉందని అధ్యయనంలో తెలిసింది. ఢిల్లీకి చెందిన టాక్సిక్స్ లింక్ సంస్థ ఇండియన్ ఉప్పుకు సంబంధించి మరో ఆసక్తికర విషయం వెల్లడించింది. సూపర్ మార్కెట్స్కు వెళ్లినప్పుడు అయోడైజ్డ్ ఉప్పు ఆరోగ్యానికి మంచిదని, అదే కావాలని కోరి మరీ కొంటుంటారు. కానీ.. ఆ అయోడైజ్డ్ సాల్ట్లోనే మైక్రోప్లాస్టిక్స్ ఎక్కువ పరిమాణంలో ఉన్నాయని టాక్సిక్స్ లింక్ అధ్యయనంలో తేలింది. చక్కెరలో కూడా మైక్రోప్లాస్టిక్ అవశేషాలు ఎక్కువ పరిమాణంలో ఉన్నట్లు తేలింది. కిలో చక్కెరలో అత్యల్పంగా 11.85 నుంచి అత్యధికంగా 68.25 మైక్రోప్లాస్టిక్ ముక్కలు కలిసి ఉన్నట్లు ఈ అధ్యయనం తెలిపింది.