తాతల కాలం నాటి ఆ రోగం ఇంకా పోలే!

మారిపోయింది  సొసైటీ. మనుషులూ మారిపోయారు అనుకుంటున్నం. కాని అంటరానితనం ఇప్పటికీ చాల చోట్ల ఉందంటే ఈ మార్పు విషయంలో డౌట్ వస్తోంది. మనిషిని మనిషిగా చూడని చెడు అలవాటు మన సమాజంలో ఇంకా మాసిపోలేదు. వ్యక్తుల పుట్టుపూర్వోత్తరాలు, కులగోత్రాలు, జాతులు, మతాలు, ఆస్తిపాస్తులు, చదువుసంధ్యల్ని బట్టే విలువ కడుతున్నారు. పక్కోణ్ని పైనుంచి కిందికి తేరిపార చూసి తేలిగ్గా తీసిపారేస్తున్నారు. కళ్లతో ఈ రేంజ్​లో స్కానింగ్​ చేశాక ఎదుటోడు ఏమాత్రం నచ్చకపోయినా ‘టచ్​ మీ నాట్​’ అని దూరం పెట్టడానికీ వెనకాడట్లేదు. తాతల కాలం నాటి ఈ అంటరానితనం నేటికీ సెంట్రల్​, నార్తిండియాలోని దాదాపు సగం ఇళ్లల్లో కొనసాగుతోందని రీసెంట్​ స్టడీ ఒకటి చెబుతోంది.

అంటరానితనం అనే రోగం ఒకప్పుడు దేశవ్యాప్తంగా ఉండేది. పల్లె, పట్నం తేడా లేకుండా ప్రతిచోటా మనుషులు పక్షపాతం చూపేవారు. అందుకే ప్రభుత్వం అంటరానితనాన్ని నేరంగా పరిగణించింది. దేశానికి సిగ్గుచేటని కూడా చెప్పింది. ఈ దుర్మార్గానికి వ్యతిరేకంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్​ బీఆర్​ అంబేద్కర్​ తీవ్రంగా ఉద్యమించారు. దీంతో 1950ల్లోనే ఆనవాళ్లు లేకుండా పోయిందనుకున్న ఈ వివక్ష ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో చోటుచేసుకుంటోంది. నార్తిండియాలో అయితే ఏకంగా 49 శాతం ఇళ్లల్లో జనాలు ఈ రోజుకీ ఈ ఫీలింగ్స్​తోనే ఉన్నారని స్టడీ చెప్తోంది.

ఈ ఎక్కువ తక్కువ ఆలోచనలు సొసైటీలోని వివిధ వర్గాల్లో, వివిధ రూపాల్లో ఉన్నట్లు ఈమధ్య నిర్వహించిన ఒక స్టడీలో తేలింది. దేశం మొత్తం మీద 42 వేల ఇళ్లల్లో సర్వే చేసి సేకరించిన డేటాని భాగాలుగా చేసి పరిశీలించి మరీ ఈ అంచనాకు వచ్చారు. రూరల్ ఏరియాల్లో అన్​టచ్​బిలిటీ 30 శాతం ఉండగా, అర్బన్​ ప్రాంతాల్లో 20 శాతమే ఉండటం కాస్త మంచి పరిణామం. కానీ అసలు ఈ ఘోరం ఇప్పటికీ ఉండటమే బాధ కలిగించే విషయం. అన్ని మతాలవారి కన్నా జైనులే ఎక్కువగా ఈ తేడాలు చూపిస్తున్నారు. ఆ మతం వాళ్లు 35 శాతం మంది అంటరానితనాన్ని పాటిస్తున్నారు.

తిండి విషయంలో జైనులు చాలా స్ట్రిక్ట్​గా ఉంటారు. వెజిటేరియన్​ వంటలే తింటారు. నాన్​ వెజిటేరియన్ ఐటమ్స్​ తినేవాళ్లను కనీసం కిచెన్​లోకి కూడా రానీయరు. ఫుడ్డుకి సంబంధించి అంత క్రమశిక్షణగా ఉంటారు కాబట్టే వాళ్లు వేరే మతస్తుల పట్ల అంటరానితనం చూపుతున్నట్లు అనిపిస్తుందనేది రీసెర్చర్ల అభిప్రాయం. జైనుల తర్వాత అంటరానితనమనే భావన ఎక్కువ కనిపించేది హిందువుల్లోనే. సుమారు 30 శాతం మంది హిందువులు ఈ దారుణాన్ని  పెంచి పోషిస్తుంటే, బౌద్ధులు మాత్రం ఒక్క శాతం మందే పాటిస్తున్నట్లు సర్వేలో బయటపడింది.

చదువును బట్టి చులకన

వ్యక్తులు ఎంత వరకు చదువుకున్నారనేదాన్ని బట్టి వాళ్లలో అంటరానితరం లెవల్స్​ని స్టడీలో అంచనా వేశారు. అక్షరమ్ముక్క రానోళ్లలో దాదాపు 30 శాతం మందికి ఈ అంటరానితనం అంటురోగంలా వ్యాపిస్తోంది. గ్రాడ్యుయేషన్​ లేదా డిప్లొమా డిగ్రీ చదివినోళ్లలో 24 శాతం మందే ఇలా అవివేకంగా ఉన్నట్లు ఆథర్లు గుర్తించారు.  నాలుగక్షరాలు నేర్చుకున్నోళ్లు మాత్రం ఈ అనాచారానికి దూరంగా ఉంటున్నారు.

బ్రాహ్మణులు ఎంత ఎక్కువ చదువుకుంటే వాళ్లలో అంత తక్కువగా ఈ భావాలు ఉంటున్నాయి. ప్రైమరీ ఎడ్యుకేషన్​ నుంచి డిగ్రీ వరకు విద్యార్హతలు గల బ్రాహ్మణులు,  ఈ ఫీలింగ్స్​ 69 శాతం నుంచి 48 శాతానికి తగ్గినట్లు సర్వేలో స్పష్టం కావటం చెప్పుకోదగ్గ విషయం. మనుషుల్లోని అంటరానితనం స్థాయిని నిర్ణయించటంలో ఆదాయం కీలక పాత్ర పోషిస్తోంది. రాబడిని బట్టి వ్యక్తులను ఐదు గ్రూపులుగా విభజించి  స్టడీ చేశారు.

సర్వే సాగిందిలా.. 

‘మీ ఇంట్లో ఎవరికైనా ఎదుటివారి పట్ల అంటరానితనం ఫీలింగ్​ ఉందా?’ అనే ప్రశ్నకు ‘ఎస్​’ ఆర్​ ‘నో’ రూపంలో ఆన్సర్లు సేకరించారు. సమాధానం ఒకవేళ ‘నో’ అయితే మరో ప్రశ్న వేసేవారు. ఎస్సీలను మీ వంటింట్లోకి రానివ్వటం లేదా ?  మీ గిన్నెలను వాళ్లతో షేర్​ చేసుకోవటం మీకు ఇష్టమేనా? అనే రెండో ప్రశ్నకూ ఇలాగే సమాధానం రాబట్టేవారు. ఈ రెండు ప్రశ్నల్లో ఏ ఒక్కదానికి ‘ఎస్​’ అనే రెస్పాన్స్​ వచ్చినా వాళ్లు అన్​టచ్​బిలిటీ దురాచారాన్ని ఆచరిస్తున్నట్లే నోట్​ చేసుకునేవారు.

అంటరానితనం సెన్సిటివ్​ ఇష్యూ కాబట్టి సర్వేలో పాల్గొన్నోళ్లు నిజం మాట్లాడారో అబద్ధం చెప్పారో అంచనా వేయటం కష్టం. కాకపోతే..  అంటరానితనం పల్లెల్లో 30 శాతం, పట్టణాల్లో 20 శాతం ఉన్నట్లు స్టడీలో తేలింది. గ్రామాల ప్రజలు తమ ఫీలింగ్స్​ని ఇతరులతో కంఫర్టబుల్​గా పంచుకుంటారు. సిటీ జనాలే రిజర్వ్​డ్​గా ఉంటారు. వాళ్లు ఉన్నది ఉన్నట్లు చెప్పరు. పల్లెటూళ్లలో అంటరానితనం ఎక్కువ ఉన్నట్లు, టౌన్లలో తక్కువ ఉన్నట్లు ఫలితాలు చూపుతున్నాయి కాబట్టి రీసెర్చ్​ని సరిగానే జరిగినట్లు భావించొచ్చు.

ఈ స్టడీ చేసిందెవరు?​

దేశంలోని వివిధ ప్రాంతాల్లో నెలకొన్న అన్ టచ్ బిలిటీ ప్రభావాన్ని లెక్కించటానికి అమిత్ థోమర్ , ఓంకార్జోషి అనే రచయితలు 2012 నాటి ఇండియన్ హ్యూమన్ డెవలప్ మెంట్ సర్వే(ఐహెచ్ డీఎస్ )–2ని బేస్ చేసుకున్నారు . థోమర్ జేఎన్ యూలో ఎకనమిక్స్ ప్రొఫెసర్ కాగా జోషి.. మేరీలాండ్ యూనివర్సి టీలో రీసెర్చ్ స్కాలర్ . ఈ సర్వేని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనమిక్ రీసెర్చ్ (ఎన్ సీఏఈఆర్ ), యూనివర్సిటీ
ఆఫ్ మేరిలాండ్ కలిసి చేశాయి. ఇందులో భాగంగా 42 వేల ఇళ్లకు డోర్ టు డోర్ వెళ్లారు.

డబ్బున్నోళ్లకు లేదీ జబ్బు

పూరెస్ట్​ క్లాస్​ నుంచి మొదలుపెట్టి రిచెస్ట్​ క్లాస్​ వరకు గ్రాఫ్​ గీస్తే వాళ్లలోని అంటరానితనం భావాలు తగ్గుతున్నట్లు రీసెర్చ్​లో తేలింది. 32.56 శాతం మంది పేదోళ్లు అన్​టచ్​బిలిటీని పెంచిపోషిస్తున్నారని, రిచెస్ట్​ గ్రూప్​కి వచ్చేసరికి ఈ పర్సంటేజీ 23.35 శాతానికే పరిమితమైనట్లు గుర్తించొచ్చు. రీజియన్​ల పరంగా స్టడీ చేస్తే నార్తిండియాలో ఏకంగా 49 శాతం ఇళ్లలో ఈ దురాచారం కొనసాగుతుండగా సెంట్రల్​ ఇండియాలో రమారమి 40 శాతం ఇళ్లలో ఈ పద్ధతులు ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో 20 శాతం లోపు మందే అంటరానితనం చూపుతుంటే తూర్పు రాష్ట్రాల్లో అంతకన్నా ఇంకా తక్కువగా కేవలం 13 శాతం మందే ఈ రోగంతో ఉన్నారు.