మానవ చరిత్రలో మైలురాయి ఆవిష్కరణగా ఖ్యాతి పొందనున్నది ఏఐ విప్లవం. 2024 నుంచి ఏఐ సాంకేతిక రంగంపై ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న చర్చల్లో.. అనేక ప్రశ్నలు, సందేహాలు, పొంచి ఉన్న ప్రమాదాలపై భిన్నమైన వాదనలను వినిపిస్తున్నాయి. రోజురోజుకు వివిధ రంగాల్లో వస్తున్న సాంకేతిక పరిజ్ఞానం మార్పులు, మనిషిపై దాని ప్రభావం, సమాజంలో ఏఐ కొత్త ఆవిష్కరణలు సరికొత్త చర్చకు దారితీస్తున్నాయి. సాంకేతిక రంగాల్లో ఇప్పటికే ఎన్నో అద్భుతాలను సృష్టించిన మైక్రోసాఫ్ట్ , టెస్లాలాంటి సంస్థల అధినేతలు బిల్గేట్స్, ఎలాన్ మస్క్ లాంటి ప్రపంచ కుబేరులు ఏఐ రంగంలో ఆసక్తిని చూపడం,
పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టడమే కాకుండా ఏఐ ప్రభావం వాటి శక్తి సామర్థ్యాలపై కీలక వ్యాఖ్యలు చేయడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశ
మైంది. ప్రపంచ కార్పొరేట్ మార్కెట్ శక్తులన్నీ ఏఐ రంగంలో భారీ పెట్టుబడులు పెడుతున్నాయి. కృత్రిమ మేధోశక్తి ప్రభావం మానవ జీవితాలను ఎంతగానో ప్రభావితం చేయనుంది.
వైద్య రంగంలో ఏఐ టెక్నాలజీ
వైద్యరంగంలో ఏఐ టెక్నాలజీ వాడకం అధికం కానుంది. ఔషధ పరిశోధన, రోగ నిర్ధారణ, భయంకరమైన వ్యాధుల నివారణలో కృత్రిమ మేధ పరిశోధనలు ముమ్మరం అవుతున్నాయి. ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాలలో రోబోటిక్ సర్జరీలు ప్రారంభమయ్యాయి. రోబో సర్జరీల ప్రభావం ప్రపంచవ్యాప్తంగా అనేక సంచలనాలకు తెరతీస్తోంది. ప్రధానంగా గుండె, మూత్రపిండాలు, కాలేయం, మెదడులాంటి కీలక అవయవాల శస్త్రచికిత్సలో రోబోలు కీలకంగా మారాయి. ముఖ్యంగా బయో మెడికల్, ఇంజినీరింగ్ రోబోటిక్స్ విద్యలకు ఏఐ టెక్నాలజీ ప్రధాన పాత్ర పోషిస్తుడడంతో విద్య, వైద్యరంగాలలో కొత్త విప్లవానికి నాంది పలికింది. ఏఐ టెక్నాలజీని విస్తృతంగా వాడుతున్న మరో కీలకరంగం రక్షణ శాఖ. భారతీయ రక్షణశాఖలోని మిలిటరీ ఇంజనీరింగ్లో ఏఐ టెక్నాలజీ రాకతో యుద్ధరీతులే మారనున్నాయి. భవిష్యత్తులో రోబోలని, రోబో బెటాలియన్ మిలిటరీలో ప్రవేశపెట్టేందుకు ఇప్పటికే అనేక దేశాలు పరిశోధనలు పూర్తి చేసుకున్నాయి. ఇజ్రాయెల్ లాంటి దేశాల్లో మిలిటరీ టెక్నాలజీని ఇప్పటికే ప్రవేశపెట్టింది. ప్రపంచంలో అత్యంత మిలిటరీ టెక్నాలజీ ఉన్న దేశంగా ఇజ్రాయెల్ అగ్రభాగాన నిలిచింది . తాజాగా ఉక్రెయిన్ , రష్యా మధ్య జరుగుతున్న యుద్ధంలోనూ టెక్నాలజీదే పెద్ద పాత్రగా మారుతున్నది.
మానవ గతిని మలుపు తిప్పనున్న ఏఐ
ప్రపంచ కార్పొరేట్ దిగ్గజం ఎలాన్ మస్క్ తన సొంత శాటిలైట్ ఇంటర్నెట్ కనెక్టివిటీని ఉక్రెయిన్ కు అందివ్వడంతో మళ్లీ ఉక్రెయిన్ ప్రపంచంతో కనెక్టివిటీలోకి వచ్చింది. ఏఐ టెక్నాలజీతో ఎంతటి ఉపయోగాలు ఉన్నాయో అదే రీతిలో నష్టాలు ఉన్నాయని కొంతమంది శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మానవ మేధస్సుపై ఏఐ ప్రభావంతో మనిషి తన మస్తిష్కంలోని సహజత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని కొంతమంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. డేటా స్టోరేజీతో మన ఆలోచన శక్తి సన్నగిల్లుతుందని ఇది భవిష్యత్తులో భారీ మేధో విధ్వంసానికి కారణం అవుతుందని నిపుణుల అభిప్రాయం. ఏఐ టెక్నాలజీని మనిషే ఆపరేట్ చేసే పరిస్థితి ఉండటంతో అది సంఘవిద్రోహ శక్తుల చేతిలోకి వెళితే అది మానవ హననానికి దారి తీసే అవకాశాలు లేకపోలేదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యంత్రానికి విచక్షణ జ్ఞానం ఉండదు. కాబట్టి అది మనిషి ఇచ్చే ఆదేశాలని బట్టి పనిచేస్తుంది. ఏరంగాల్లో ఏఐ టెక్నాలజీ అవసరం ఉన్నది. ఏ రంగాల్లో అవసరం ఉండదన్న దానిపై లోతైన అధ్యయనం జరగాలి. ఏది ఏమైనా ప్రపంచంలో విద్యుత్ తర్వాత విప్లవాత్మక టెక్నాలజీ ఏఐ మాత్రమే. మానవ వికాసానికి, అభివృద్ధికి టెక్నాలజీ ఉపయోగపడితే అది యావత్ ప్రపంచ అభివృద్ధికి ఒక ముందడుగు.
- దొమ్మాట వెంకటేశ్, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్