SA20, 2024: క్రికెట్ చరిత్రలో అద్భుతం..సూపర్ మ్యాన్ తరహాలో మార్కరం క్యాచ్

SA20, 2024: క్రికెట్ చరిత్రలో అద్భుతం..సూపర్ మ్యాన్ తరహాలో మార్కరం క్యాచ్

క్రికెట్ లో గ్రేట్ క్యాచులు అందుకోవడం ఒకప్పుడు అరుదుగా చూసేవాళ్ళం. కానీ టీ20 లీగ్ లు ఎక్కువైన తరుణంలో ఒక్క క్యాచ్ మ్యాచ్ ని డిసైడ్ చేసేస్తోంది. దీంతో బ్యాటింగ్, బౌలింగ్ మీదే కాదు ఫీల్డింగ్ మీద కూడా ప్లేయర్లు ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ఈ క్రమంలో క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు నమ్మశక్యం కానీ రీతిలో క్యాచులు అందుకుంటూ అభిమానులని థ్రిల్ కి గురి చేశారు. 

ఐపీఎల్, బిగ్ బాష్ లీగ్ లాంటి మెగా టోర్నీలో ఒకదానికి మించి మరో క్యాచ్ ని అందుకుంటూ ఆడియన్స్ కి కిక్ ఇస్తోనే ఉన్నారు.తాజాగా అలాంటి క్యాచ్ ఒకటి సౌతాఫ్రికా టీ20 లీగ్ లో నమోదయింది. సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ కెప్టెన్ మార్కరం పట్టిన ఒక క్యాచ్ సూపర్ మ్యాన్ ను తలపిస్తుంది. క్యాచ్ ఇలా కూడా పడతారా అనే కొత్త అనుమానం మనలో కలుగుతుంది.
 
మొదటి క్వాలిఫయర్ లో భాగంగా డర్బన్ సూపర్ జయింట్స్ ఛేజింగ్ చేస్తున్నప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది. పేసర్ బార్ట్ మెన్ వేసిన నాలుగో ఓవర్ ఐదో బంతికి స్మట్స్ మిడాన్ మీదుగా షాట్ ఆడాడు. బ్యాట్ చివరన తగలడంతో టైమింగ్ సరిగా కుదరలేదు. మిడాన్ మీదుగా వెళ్తున్న బంతిని మార్కరం నమ్మశక్యం కానీ రీతిలో అందుకున్నాడు. గాల్లోకి  పక్షిలా అమాంతం ఎగిరి సింగిల్ హ్యాండ్ తో క్యాచ్ అందుకున్నాడు. మార్కరం అందుకున్న ఈ క్యాచ్ కు బ్యాటర్ తో పాటు స్టేడియం ఆశ్చర్యపోయింది. 

ఈ మ్యాచ్ లో  సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ డర్బన్ సూపర్ జెయింట్స్‌పై 51 పరుగుల తేడాతో గెలిచి వరుసగా రెండో సారి ఫైనల్ కు దూసుకెళ్లింది. మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవరల్లో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఒక మాదిరి లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన డర్బన్ 106 పరుగులకే కుప్ప కూలింది.మార్కో జాన్సెన్, బార్ట్ మెన్ చెరో నాలుగు వికెట్లతో డర్బన్ లైనప్ ను కుప్ప కూల్చారు.