పెషావర్: పాకిస్తాన్‌లో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 12 మంది భద్రతా సిబ్బంది, ఆరుగురు టెర్రరిస్టులు చనిపోయారు. ఈ మేరకు బుధవారం ఆర్మీ ఓ ప్రకటనను విడుదల చేసింది. మంగళవారం ఖైబర్ పంఖ్తుఖ్వా ప్రావిన్స్ బన్నూ జిల్లాలోని మాలిఖేల్ జాయింట్ చెక్ పోస్టు సమీపంలో పేలుడు పదార్థాలతో కూడిన వాహనాన్ని తీసుకొచ్చి సూసైడ్ బాంబర్ పేల్చేశాడు. దీంతో ఆర్మీ జాయింట్ చెక్ పోస్టు మౌలిక సదుపాయాలు దెబ్బతినడంతో పాటు 12 మంది సైనికులు, ఆరుగురు టెర్రరిస్టులు చనిపోయారు. ఘటన తర్వాత మరికొంత మంది టెర్రరిస్టులు చెక్ పోస్టుపైకి కాల్పులు జరిపారు. ఈ దాడిలో మరో ఆరుగురు జవాన్లు కూడా గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నామని అధికారులు తెలిపారు.