చౌటుప్పల్, వెలుగు : యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో పోలీసుల పహారా మధ్య ట్రిపుల్ ఆర్భూ సేకరణపై బుధవారం సర్వే జరిగింది. 83 ఎకరాల్లో ఆఫీసర్లు హద్దులు ఏర్పాటు చేశారు. యాదాద్రి జిల్లా మీదుగా వెళ్లే రీజినల్ రింగ్ రోడ్డు కోసం చౌటుప్పల్మండలంలో అదనంగా 280 ఎకరాలను భూమి సేకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే.. భూములు, ఇండ్ల స్థలాలు కోల్పోతున్న వారు ట్రిపుల్ ఆర్కు వ్యతిరేకంగా ఇటీవల ఆందోళన నిర్వహించారు. దీంతో ముందస్తు జాగ్రత్తగా చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం, భూదాన్‌పోచంపల్లి నుంచి పోలీసులను రప్పించి ఆఫీసర్లు సర్వే నిర్వహించారు.
సర్వే జరుగుతున్న విషయం తెలుసుకున్న బాధితులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. అయితే వారిని సర్వే చేస్తున్న చోటికి వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకోవడంతో బాధితులు వాగ్వాదానికి దిగారు. సమాచారం అందుకున్న చౌటుప్పల్తహసీల్దార్హరికృష్ణ సర్వే జరుగుతున్న ప్రాంతానికి వచ్చి బాధితులతో మాట్లాడారు. బాధితులకు నష్టం జరుగుతున్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని, న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో బాధితులు ఆందోళన విరమించి వెనుదిరిగారు.