
- స్వీపరే డాక్టరయ్యింది
- బాలింతకు ట్రీట్మెంట్ చేసిన వైనం
- మాగనూర్ పీహెచ్సీలో డాక్టర్, నర్సులు లేక తిప్పలు
- ఒక్క నర్సుతోనే నడిపిస్తున్నరు
మాగనూర్, వెలుగు : నారాయణపేట జిల్లా మాగనూర్ప్రైమరీ హెల్త్ సెంటర్ లో స్టాఫ్కొరత వేధిస్తోంది. ముగ్గురు స్టాఫ్నర్సులుండాల్సిన చోట ఒక్కరే ఉండడం, ఆమెపై పని భారం పడడంతో పేషెంట్లకు తిప్పలు తప్పడం లేదు. దీంతో డెలివరీ కోసం దవాఖానాకు వస్తున్న ఓ మహిళ ఆటోలోనే ప్రసవించగా ఆమెకు స్వీపరే వైద్యం అందించాల్సిన దుస్థితి దాపురించింది. మండలంలోని కొత్తపల్లికి చెందిన రషీత రెండో కాన్పు కోసం శనివారం అర్ధరాత్రి మాగనూర్ ప్రైమరీ హెల్త్ సెంటర్ వచ్చింది. పరీక్షించిన స్టాఫ్ నర్స్ కవిత డెలివరీ లేట్ అవుతుందని, ఈనెల 11న డెలివరీ అయ్యే అవకాశం ఉందని చెప్పింది. దీంతో వారు ఉదయం నాలుగు గంటలకు ఇంటికి వెళ్లిపోయారు. మళ్లీ 6 గంటల ప్రాంతంలో నొప్పులు రావడంతో ఆటోలో పీహెచ్‌సీకి వస్తుండగా మధ్యలోనే డెలివరీ అయింది. తర్వాత పీహెచ్‌సీకి రాగా వైద్య సిబ్బంది ఎవరూ అందుబాటు లేకపోవడంతో అక్కడున్న స్వీపర్ రాములమ్మ పేగు కట్ చేసి డ్రెస్సింగ్ చేసింది.
ఈ విషయమై డీఎంహెచ్ఓ రామ్మోహన్ రావును వివరణ కోరగా పీహెచ్సీలో సిబ్బంది కొరత ఉందని, డాక్టర్లేడని, ముగ్గురు స్టాఫ్ నర్సులు ఉండాల్సిన చోట ఒక్కరే ఉన్నారని, ఆమె కూడా వారం నుంచి రెస్ట్ లేకుండా డ్యూటీ చేస్తున్నారని చెప్పారు. అనారోగ్య సమస్యతో ఆదివారం తెల్లవారుజామున త్వరగా వెళ్లిపోయినట్టు చెప్పారు. ఉమ్మడి మాగనూర్, కృష్ణ మండలాల్లో ఉన్న 54వేలకు పైగా జనాభాకు ఈ ఒక్కటే ప్రైమరీ హెల్త్ సెంటరే దిక్కు. కలెక్టర్ చొరవ తీసుకుని డాక్టర్‌తో పాటు పూర్తిస్థాయి స్టాఫ్‌ను నియమించాలని కోరుతున్నారు.