- క్రిస్మస్ గిఫ్ట్‌ల పేరిట విద్యార్థులకు బైబిల్స్ పంపిణీ
- స్కూల్ కు వెళ్లి నిలదీసిన బీజేపీ లీడర్లు
- టీచర్ ను సస్పెండ్ చేసిన ఆఫీసర్లు
ఎల్లారెడ్డిపేట,వెలుగు: ప్రభుత్వ స్కూల్ లో మత ప్రచారానికి పాల్పడిన టీచర్ ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ హైస్కూల్ లో బుధవారం స్కూల్ అసిస్టెంట్ లింగాల రాజు క్రిస్మస్ పేరిట సుమారు 100 మంది స్టూడెంట్స్ కు బైబిల్స్ గిఫ్ట్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. వెంటనే బీజేపీ నేతలు స్కూల్ కు వెళ్లి మత ప్రచారం ఎందుకు చేస్తున్నావని టీచర్ ను ప్రశ్నించారు.
క్రిస్మస్ సందర్భంగా ఓ స్వచ్ఛంద సంస్థ అందజేసిన గిఫ్ట్ లను విద్యార్థులకు పంపిణీ చేశానని టీచర్ సమాధానం ఇచ్చారు. దీంతో మత ప్రచారం చేస్తున్నారని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేయగా గొడవకు దారి తీసింది. విద్యార్థులను మత మార్పిడికి పాల్పడుతున్న టీచర్ రాజును వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఎంఈఓ కృష్ణహరి, ఎస్ఐ రమాకాంత్ కు స్కూల్ ఇన్ చార్జ్ ప్రిన్సిపాల్ ఫిర్యాదు చేయగా వెళ్లి విచారించారు. విద్యార్థులకు పంపిణీ చేసిన గిఫ్ట్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఘటనపై డీఈఓకు రిపోర్ట్ చేశారు. విచారణ అనంతరం టీచర్ రాజును సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాధికారి జగన్మోహన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.