ప్రొఫెసర్ సాయిబాబాకు కన్నీటి వీడ్కోలు

ప్రొఫెసర్ సాయిబాబాకు కన్నీటి వీడ్కోలు
  • నివాళులర్పించిన రాజకీయ, ప్రజా సంఘాల నేతలు, అభిమానులు
  • పార్థివదేహం గాంధీ మెడికల్ కాలేజీకి అప్పగింత
  • నివాళులర్పించేందుకు వెళ్లిన కేటీఆర్​కు నిరసన సెగ 
  •  బీఆర్ఎస్ హయాంలో 150 మందిపై ఉపా కేసులు పెట్టారని పౌర హక్కుల నేతలు ఫైర్ 

మల్కాజిగిరి/పద్మారావునగర్, వెలుగు: విద్యావేత్త, పౌర హక్కుల నేత ప్రొఫెసర్ ​జీఎన్​సాయిబాబాకు రాజకీయ, ప్రజా సంఘాల నేతలు, అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. కుటుంబ సభ్యులు ఆయన పార్థివదేహాన్ని సోమవారం గాంధీ హాస్పిటల్​కు అప్పగించారు. సాయిబాబా భౌతికకాయాన్ని మొదట నిమ్స్​దవాఖాన నుంచి గన్​పార్క్​వద్దకు తీసుకెళ్లారు. అక్కడ పలువురు నివాళులర్పించారు. గన్ పార్క్ వద్ద 5 నిమిషాల పాటు సాయిబాబా సంతాప సమావేశం ఏర్పాటు చేస్తామని కుటుంబసభ్యులు, అభిమానులు కోరగా.. పర్మిషన్ లేదని పోలీసులు అనుమతించలేదు. అంబులెన్స్​ నుంచి డెడ్​బాడీని దింపనివ్వలేదు. ఈ క్రమంలో పోలీసులు, పౌర హక్కుల నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం సాయిబాబా పార్థివదేహాన్ని మౌలాలి జవహర్‌‌‌‌నగర్‌‌‌‌లోని ఆయన ఇంటికి తరలించారు. ప్రజల సందర్శనార్థం ఉదయం 10:15 గంటల నుంచి మధ్యాహ్నం 1:50 గంటల వరకు అక్కడ ఉంచారు. ఈ సందర్భంగా రాజకీయ, ప్రజా సంఘాల నేతలు నివాళులర్పించారు. మౌలాలి నుంచి గాంధీ దవాఖాన వరకు అంతిమయాత్ర నిర్వహించగా, జనం పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తర్వాత సాయిబాబా కుటుంబసభ్యులు ఆయన భౌతికకాయాన్ని గాంధీ మెడికల్ కాలేజీకి అప్పగించారు. 

 ‘గో బ్యాక్​ కేటీఆర్’ నినాదాలు

సాయిబాబాకు నివాళులర్పించేందుకు వెళ్లిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్​కు నిరసన సెగ తగిలింది. ఆయన సాయిబాబాకు నివాళులర్పిస్తుండగా అక్కడే ఉన్న కొందరు పౌరహక్కుల సంఘం నేతలు, ప్రజా సంఘాల లీడర్లు ‘గో బ్యాక్​కేటీఆర్.. డౌన్​డౌన్​ కేటీఆర్’ అంటూ నినాదాలు చేశారు.

బీఆర్ఎస్​హయాంలో 150 మందిపై అకారణంగా ఉపా కేసులు పెట్టారని మండిపడ్డారు. ‘‘ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్​ హరగోపాల్, విమలక్కపై ఉపా కేసులు పెట్టి వేధించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన బీఆర్ఎస్ లీడర్లు.. ఇప్పుడు దండలు పట్టుకుని నివాళులర్పించేందుకు వచ్చారు. నిన్నటి వరకు నిర్బంధాన్ని ప్రయోగించి.. ఇప్పుడు ప్రజల్లో మంచి మార్కులు  కొట్టేయాలని వచ్చినావా కేటీఆర్?” అని ప్రశ్నించారు.

పదేండ్లు సాయిబాబా జైల్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్​ కనీసం పట్టించుకోలేదని మండిపడ్డారు. ‘150 మందిపై పెట్టిన ఉపా కేసులను ఉపసంహరించుకున్నట్టు ప్రకటించిన తర్వాతే కేటీఆర్​ఇక్కడికి రావాలి’ అని పౌర హక్కుల సంఘం నేత లక్ష్మణ్​అన్నారు. దీంతో కేటీఆర్​అక్కడి నుంచి వెళ్లిపోయారు.  

ప్రముఖుల నివాళి

సాయిబాబాకు పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ కాశీం, విమలక్క, బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు హరీశ్​రావు, కేటీఆర్, కాంగ్రెస్ లీడర్లు కె.కేశవరావు, మధుయాష్కీ, పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్, తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, పీవోడబ్ల్యూ నేత సంధ్య, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు మురళీధరన్ తదితరులు నివాళులర్పించారు. సాయిబాబాది సహజ మరణం కాదని, ఆయన పదేండ్లు జైల్లో మగ్గిపోయారని విమలక్క అన్నారు. సాయిబాబా విషయంలో కేంద్రం పాశవికంగా ప్రవర్తించిందని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం మండిపడ్డారు.