ఫీజు కట్టలేదని మందలించిన ప్రిన్సిపాల్.. మనస్తాపంతో టెన్త్​ స్టూడెంట్ ఆత్మహత్య

ఫీజు కట్టలేదని మందలించిన ప్రిన్సిపాల్.. మనస్తాపంతో టెన్త్​ స్టూడెంట్ ఆత్మహత్య

మేడ్చల్, వెలుగు: ఫీజు కట్టలేదని స్కూల్ ప్రిన్సిపాల్ మందలించడంతో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. మేడ్చల్కు చెందిన  వెంకటేశ్, కమల దంపతులు. వీరికి ఒక కొడుకు, కూతురు అఖిల(16) ఉండగా, అఖిల స్థానికంగా ఉన్న ఓ కార్పొరేట్​స్కూల్లో పదో తరగతి చదువుతోంది. ఫీజు కట్టకపోవడంతో ఆమెను క్లాస్ రూమ్లో శనివారం స్కూల్ ప్రిన్సిపాల్ మందలించాడు.

దీంతో మనస్తాపానికి గురైన బాలిక సోమవారం స్కూల్కు కూడా వెళ్లలేదు. అదే వేదనతో మంగళవారం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. కుటుంబ సభ్యులు గమనించి బాధితురాలిని సికింద్రాబాద్ యశోద హాస్పిటల్కు తరలించగా,  బుధవారం సాయంత్రం చికిత్స పొందుతూ మృతి చెందింది. అంతకుముందు స్కూల్ ఎదుట బాధిత తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఫీజు విషయం తమతో మాట్లాడాలి గానీ పిల్లలను అడగడమేంటని నిలదీశారు. ఇప్పుడు ఫీజు కడతాం, తమ బిడ్డను తిరిగి తీసుకురావాలని కన్నీరుమున్నీరుగా విలపించారు.