- పార్టీ అనుబంధ సంస్థలపై నిషేధం ఎత్తివేయాలి
- కల్వకుంట్ల ఫ్యామిలీ అవినీతిపై విచారణ చేపట్టాలి
- మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ పేరుతో లేఖ
వెంకటాపురం, వెలుగు : ఎన్ కౌంటర్లు లేని తెలంగాణ నెలకొల్పాలని ,సీపీఐ (మావోయిస్టు), అనుబంధ ప్రజా సంఘాలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పేరుతో ఒక లేఖ విడుదలైంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తన పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందని, రాష్ట్ర వనరులన కొల్లగొట్టిందని ఆ లేఖలో పేర్కొన్నారు.
‘‘ఆర్థిక అభివృద్ధి పేరుతో అంకెల గారడీ చూపించి రాష్ట్రంలో మళ్లీ భూస్వామ్య, పెత్తందారీ, గడీల నిర్మాణానికి పునాదులు వేశారు. కాళేశ్వరం పేరిట దోచుకున్నారు. మిషన్ భగీరథ, మేడిగడ్డ ప్రాజెక్టులో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు.
మాజీ సీఎం కేసీఆర్ కు అన్ని ఆస్తులు ఎక్కడివి? హరీశ్ రావు ఏ శ్రమతో వేల కోట్ల ఆసామి అయ్యాడు? సెక్రటేరియెట్, కలెక్టరేట్లు, స్మృతి చిహ్నం, అంబేద్కర్ విగ్రహం, వరంగల్ హాస్పిటల్ ద్వారా చేతులు మారి కేసీఆర్ కుటుంబానికి చేరిన మొత్తం ఎన్ని కోట్లు? నయీమ్ ఎన్ కౌంటర్ తర్వాత జప్తు చేసిన రూ.5 వేల కోట్లు ఎక్కడికి పోయాయి? కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌజ్, కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌజ్, కవిత రూ.3 కోట్ల చేతి గడియారం, సంతోష్ రావు గ్రీన్ స్కీం బండారం, వరంగల్ హాస్పిటల్ అంచనా వ్యయం రూ.మూడున్నర వేల కోట్లకు చేరడం వంటి వాటిపై శ్వేతపత్రాలు బయటపెట్టిన పాలకులు.. కేసీఆర్ అక్రమ ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయగలరా?” అని ఆ లేఖలో ప్రశ్నించారు.
ప్రజా ఆస్తులను కొల్లగొట్టిన కేసీఆర్ కుటుంబాన్ని ప్రజల ముందు దోషులుగా నిలబెట్టి శిక్షించాలని, కేసీఆర్ కుటుంబం అవినీతిపై వెంటనే విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని అందులో డిమాండ్ చేశారు. కేసీఆర్ అవినీతిపై విచారణ జరపుతామని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటను నిలుపుకోవాలని ఆ లేఖలో సూచించారు.