లాహోర్: పాకిస్తాన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మినీ ట్రక్కు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు చిన్నారులు సహా 14 మంది మృతిచెందారు. మరో 12 మంది గాయాలపాలయ్యారు. పంజాబ్ ప్రావిన్స్‌లో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. ట్రక్కు.. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని బన్నూ జిల్లా నుంచి పంజాబ్‌లోని ఖుషాబ్ జిల్లాకు వస్తుండగా పెంచ్ పీర్ ప్రాంతంలో మూల మలుపు వద్ద రోడ్డుపై నుంచి జారి లోయలో పడిపోయింది.
ప్రమాదం విషయం తెలిసిన వెంటనే రెస్క్యూ సిబ్బంది స్పాట్‌కు చేరుకొని గాయపడిన తొమ్మిది మందిని ఆస్పత్రికి తరలించారు. అయితే, వారి పరిస్థితి కూడా క్రిటికల్‌గానే ఉందని సమాచారం. బాధితులంతా కూలీ పనుల నిమిత్తం ఖుషాబ్‌కు వస్తున్నట్టు తెలిసిందని రెస్క్యూ టీమ్ సిబ్బంది చెప్పా రు. ప్రమాదానికి అతివేగమే కారణమని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాగా, ఈ ఘటనపై పాకిస్తాన్‌లోని పంజాబ్ సీఎం మరియమ్ నవాజ్ సంతాపం వ్యక్తంచేశారు. గాయపడిన వారికి మెరుగైన ట్రీట్మెంట్అందించాలని అధికారులను ఆదేశించారు.