డబ్లిన్: ఐర్లాండులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం కార్లోలో కౌంటీలోని గ్రేగ్యునాస్పిడోజ్ వద్ద ఓ కారు అదుపుతప్పి రోడ్డుపక్కనున్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 20 ఏండ్ల వయసున్న ఇద్దరు తెలుగు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను చెరుకూరి సురేశ్ చౌదరి, చిత్తూరి భార్గవ్‌గా అధికారులు గుర్తించారు. గాయపడిన మరో యువతి, యువకుడిని దవాఖానకు తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నట్టు వివరించారు.
ఈ నలుగురూ స్నేహితులని.. కార్లోలోని సౌత్ ఈస్ట్ టెక్నలాజికల్ యూనివర్సిటీ (ఎస్ఈటీయూ)లో చదువుతున్నారని వెల్లడించారు. ఘటనపై డబ్లిన్‌లోని భారత ఎంబసీ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. గాయపడ్డ విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించేందుకు సహకారమందిస్తున్నట్టు ప్రకటించింది. బాధితుల్లో ఒకరి ఫ్రెండ్.. మృతుల అంత్యక్రియల ఖర్చుల కోసం నిధుల సమీకరణను ప్రారంభించారు. 24 గంటల్లో 25 వేల యూరోలు(22 లక్షలు) సేకరించారు.