మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం.. 40 మంది ప్రయాణికులు మృతి

మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం.. 40 మంది ప్రయాణికులు మృతి

మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాన్కున్ నుంచి టబాస్కోకు ప్రయాణికులతో వెళ్తున్న బస్సును ట్రక్కు ఢీకొట్టింది. దీంతో క్షణాల్లోనే బస్సు మంటల్లో కాలి దగ్ధమైంది. ఈ ఘటనలో బస్సులో ఉన్న 40 మంది ప్రయాణికులు సజీవ దహనం కాగా.. మరికొందరు ప్యాసింజర్లు తీవ్రంగా గాయపడినట్లు అక్కడి మీడియా వెల్లడించింది. సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘోర ప్రమాదంపై టబాస్కోలోని కోమల్‌కాల్కో మేయర్ ఓవిడియో పెరాల్టా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కాన్‌కున్ నుండి టబాస్కోకు ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురి కావడం పట్ల చింతిస్తున్నా. మృతుల కుటుంబాలకు సంఘీభావం తెలియజేస్తున్నాను. మృతుల కుటుంబాలకు అన్ని విధాలుగా సహయం చేసి ఆదుకుంటాం’’ అని పేర్కొన్నారు. ప్రమాదం గురించి సమాచారం తెలిసిన వెంటనే రెస్య్కూ బృందాలను, స్థానిక అధికారులను ఘటన స్థలానికి పంపి సహయక చర్యలు ప్రారంభించామని ఆయన తెలిపారు. 

గాయపడ్డ వారికి అత్యవసర చికిత్స అందిస్తున్నామని చెప్పారు. బస్సు ప్రమాదానికి గురైన సమయంలో అందులో 44 మంది ప్రయాణికులు ఉన్నట్లు బస్ ఆపరేటర్ వెల్లడించారు. ఈ విషాద ఘటనపై బస్ ఏజెన్సీ స్పందించింది. ప్రమాద సమయంలో బస్సు పరిమిత వేగంలోనే ఉందని.. ప్రమాదానికి గల కారణం ఏంటనే దానిపై ఆరా తీస్తున్నామని తెలిపింది. దర్యాప్తులో అధికారులకు పూర్తిగా సహకరిస్తామని కంపెనీ స్పష్టం చేసింది.