వృద్ధురాలికి లిఫ్ట్ ఇచ్చి.. పుస్తెలతాడు చోరీ

వృద్ధురాలికి లిఫ్ట్ ఇచ్చి.. పుస్తెలతాడు చోరీ

శామీర్ పేట, వెలుగు: శామీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు ఓ వృద్ధురాలికి బైక్​పై లిఫ్ట్ ఇచ్చి, కొంత దూరం వెళ్లాక ఆమె మెడలోని 2 తులాల పుస్తెలతాడును చోరీ చేశాడు. సీఐ శ్రీనాథ్ కథనం ప్రకారం.. మేడ్చల్ జిల్లా కీసర మండలం ధర్మారం గ్రామానికి చెందిన సరపల్లి వరలక్ష్మి శుక్రవారం పెన్షన్​డబ్బులు తీసుకునేందుకు తూంకుంట మున్సిపల్ పరిధిలోని దేవరయాంజాల్​కు వచ్చింది.  డబ్బులు తీసుకుని, స్వగ్రామం వెళ్తోంది. మార్గమధ్యలో దొంగల మైసమ్మ చౌరస్తా వద్ద దిగి, కీసర వైపు వెళ్లేందుకు బస్టాండ్​లో ఎదురుచూస్తోంది. ఆ సమయంలో అక్కడికి గుర్తు తెలియని ఓ యువకుడు బైక్​పై వచ్చి, తాను తిమ్మాయిపల్లి వెళ్తున్నానని, దారిలో దింపేస్తానని నమ్మించాడు. బైక్​ఎక్కించుకుని, కొంత దూరం వెళ్లాక.. ఆమె మెడలోని పుస్తెలతాడు లాక్కొని, పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.