- బండరాయిపై కూర్చుని గట్టుపైకి రాకుండా పోలీసులకు చుక్కలు
- చీకటి పడగానే అట్నుంచి అటే పరారైన నిందితుడు
- సూరారం పోలీస్స్టేషన్ పరిధిలో ఘటన
జీడిమెట్ల, వెలుగు: ఓ దొంగ చోరీ చేసేందుకు ఓ ఇంట్లోకి వెళ్లాడు. ఇంటివాళ్లు రావడం చూసి పారిపోయేందుకు పక్కనే ఉన్న చెరువులోకి దూకాడు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి.. చెరువు మధ్యలోని రాయిపై కూర్చున్న దొంగను ‘బయటకు రారా’ బాబు అని హెచ్చరించారు. అయినా దొంగ అక్కడి నుంచి కదలలేదు. రాత్రి కావడంతో దొంగను పట్టుకునేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ ఘటన సూరారం పీఎస్ పరిధిలో జరిగింది. సూరారం పరిధిలోని న్యూ శివాలయానికి చెందిన నందకుమార్ శుక్రవారం ఇంటికి తాళం వేసి భార్యతో కలిసి నర్సాపూర్ వెళ్లాడు. అతని ఇద్దరు పిల్లలు స్కూల్కు వెళ్లారు. సాయంత్రం ఓ దొంగ ఇంటి తాళం పగలగొట్టి లోనికి వెళ్లాడు. బీరువా తెరిచి చోరీ చేస్తుండగా.. నందకుమార్ కూతురు స్కూల్నుంచి వచ్చింది. ఆమె రాకను చూసిన దొంగ ఇంటిపక్కనే ఉన్న చెరువులో దూకాడు.
ఈదుకుంటూ వెళ్లి చెరువు మధ్యలో ఉన్న బండరాయిపై కూర్చున్నాడు.సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. బయటకు రావాలంటూ దొంగను హెచ్చరించారు. అయినా అతడు రాలేదు. చెరువు మధ్యలోని ఓ రాయిపై కూర్చుని పలు విన్యాసాలు చేస్తూ.. బయటకు రాకుండా పోలీసులకు చుక్కలు చూపించాడు. చివరకు చీకటిపడటంతో అతడు కన్పించకుండ పోయాడు. కాగా, నందకుమార్ ఇంట్లోని బంగారు కమ్మలను ఆ దొంగ ఎత్తుకెళ్లినట్లు గుర్తించామని.. కేసు ఫైల్ చేసి నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.