
- నోట్లో గుడ్డలు కుక్కి బంగారం దొంగతనం
- ఊపిరాడక స్పృహ కోల్పోయిన బాధితురాలు
- గుంజడంతో తెగిన చెవి
- చికిత్స పొందుతూ మృతి
- గజ్వేల్ మండలం కొల్గూర్లో దారుణం
గజ్వేల్, వెలుగు : చోరీ కోసం ఇంట్లో చొరబడిన ఓ దొంగ మహిళ మెడలో నుంచి బంగారం లాక్కునే క్రమంలో ఊపిరాడకుండా చేశాడు. తర్వాత గాయపరచడంతో చికిత్స పొందుతూ చనిపోయింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్‌మండలం కొల్గూర్లో జరిగింది. సిద్దిపేట సీపీ అనురాధ కథనం ప్రకారం..కొల్గూర్ గ్రామానికి చెందిన చెన్న శ్యామల(55), భర్త శ్రీనివాస్‌తో కలిసి కిరాణా షాప్ నిర్వహిస్తోంది. శుక్రవారం తెల్లవారుజామున శ్యామల బెడ్ రూమ్ లో నుంచి లేచి ఇంటి ఆవరణలో ఉన్న వాష్‌రూమ్‌కు వెళ్లింది. ఆ సమయంలో ఓ దొంగ ఇంట్లోకి ప్రవేశించి షాప్‌లో ఉన్న క్యాష్ తీసుకుని బెడ్రూమ్కు గడియ పెట్టాడు. వాష్‌రూం నుంచి బయటకు వస్తున్న శ్యామలను గమనించిన దొంగ ఆమె మెడలోని బంగారాన్ని లాక్కునే ప్రయత్నం చేశాడు. ఆమె గట్టిగా అరుస్తుండడంతో నోట్లో గుడ్డలు కుక్కి గట్టిగా పట్టుకోవడంతో ఊపిరాడక స్పృహ కోల్పోయింది.
ఆమె మెడలో ఉన్న మూడు తులాల బంగారు పుస్తెలతాడు తెంపాడు. చెవులకు అర తులం కమ్మలు ఉండడంతో ఒక చెవి కమ్మ తీసుకున్నాడు. మరో కమ్మ రాకపోవడంతో బలవంతగా లాగాడు. దీంతో చెవి తెగి రక్తం వచ్చింది. తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. భర్త లోపలి నుంచి కేకలు వేస్తుండడంతో కొద్దిసేపటికి స్పృహలోకి వచ్చింది. ఎట్లాగో బలాన్ని కూడదీసుకుని లేచి వెళ్లి గడియ తీసింది. బయటకు వచ్చిన భర్తతో ‘దొంగోడు బంగారమంతా ఎత్తుకపోయిండు..ఊపిరాడకుంట చేసిండు..ఎట్లనో అయితుంది..నేనిగ బతుక’ అంటూ కుప్పకూలింది. వెంటనే అతడు చుట్టుపక్కల వారి సాయంతో ఆమెను గజ్వేల్ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించగా అక్కడే చికిత్స పొందుతూ చనిపోయింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీపీ తెలిపారు.