- పీపీఈ కిట్ లో వచ్చి రూ.13 కోట్ల బంగారం దోపిడీ
- ఢిల్లీ జ్యువెలరీ షాప్‌లో భారీ చోరీ
- దొంగను పట్టుకున్న పోలీసులు
న్యూఢిల్లీ: కరోనా నుంచి కాపాడే పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్(పీపీఈ) కిట్ తనను దొరకకుండా కూడా రక్షిస్తుందనుకున్నడో దొంగ.. నగల షాపును కొల్లగొడదామని ప్లానేసిండు, అనుకున్నట్లే దానిని పక్కాగా అమలు చేసిండు. అంతా బాగా పూర్తిచేశానని, దొంగిలించిన 25 కేజీల బంగారాన్ని చూసుకుంటూ మురిసిపోతుంటే.. పోలీసులు వచ్చి అరెస్టు చేసి తీసుకెళ్లిన్రు. ఢిల్లీలో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ దొంగతనం కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. కర్నాటకకు చెందిన మొహమ్మద్ షేక్ నూర్ ఢిల్లీలో చిన్న ఎలక్ట్రానిక్ షాపు నడిపిస్తూ బతుకుతున్నడు. దానిపై వచ్చే ఆదాయం సరిపోలేదో, లగ్జరీగా బతకాలని అనుకున్నడో కానీ దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నడు. తన షాపుకు దగ్గర్లోనే ఉన్న ఓ నగల షాపుపై కన్నేసిండు. మంగళవారం రాత్రి దొంగతనం చేయడానికి రెడీ అయిండు. షాపు ముందున్న సెక్యూరిటీని, లోపలున్న సీసీ కెమెరాలను బోల్తా కొట్టించేందుకు పీపీఈ కిట్ వేసుకున్నడు. షాపు పక్కనే ఉన్న ఓ బిల్డింగ్ పైకెక్కి, అక్కడి నుంచి నగల దుకాణంలోకి దూరిండు. రాత్రి తొమ్మిది గంటలకు లోపలికి పోయిన షేక్ నూర్ ఎక్కడా హడావిడి పడలే. తెల్లవారుజామున 3 గంటల దాకా షాపులోనే ఉన్నడు. నింపాదిగా అన్నీ వెతుక్కుంటూ, దాదాపు రూ.13 కోట్ల విలువైన 25 కిలోల నగలు, బంగారాన్ని మూటకట్టుకున్నడు. నగల షాపు వెనకవైపు పార్క్ చేసిన ఆటోలో మాయమైండు. తెల్లారినంక షాపులో దొంగతనం బయటపడ్డది. పోలీసులు, షాపు ఓనర్లు కలిసి సీసీటీవీ ఫుటేజ్ చూడగా.. పీపీఈ కిట్ వేసుకున్న ఓ వ్యక్తి షాపులోని నగలను కొట్టేయడం, ఆటోలో వెళ్లిపోవడం కనిపించింది. ఈ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు షేక్ నూర్‌ను అరెస్టు చేశారు.
For More News..