హైదరాబాద్ : గొలుసు దొంగతనం చేసి తప్పించుకు తిరుగుతున్న ఓ దొంగను కూకట్ పల్లి పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. నిందితుడు వద్ద నుంచి చోరీ చేసిన సొత్తును స్వాధీనం చేసుకుని, నిందితుడిని రిమాండ్ కు తరలించారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రానికి చెందిన సరోజ్ కుమార్ పాత్ర(29) అనే వ్యక్తి ఉపాధి కోసం హైదరాబాద్ కు వచ్చాడు. బాలానగర్ లోని ఓ పరిశ్రమలో పని చేస్తూ ఫతేనగర్ లో నివాసం ఉంటున్నాడు. సొంత అవసరాల కోసం అప్పులు చేసిన సరోజ్ కుమార్.. వాటిని తీర్చేందుకు ఈజీగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ చేశాడు. ఈ క్రమంలోనే దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. ఈనెల 4వ తేదీన మూసాపేటలో నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మెడలో నుంచి గోల్డ్ చైన్ ను తెంపుకుని పారిపోయాడు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలంలోని సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే గోల్డ్ చైన్ ను విక్రయిస్తుండగా నిందితుడు సరోజ్ కుమార్ పోలీసులకు పట్టుబడ్డాడు. నిందితుడి వద్ద నుంచి 2.5 తులాల గోల్డ్ చైన్ ను స్వాధీనం చేసుకున్నామని కూకట్‌పల్లి ఏసీపీ చంద్రశేఖర్ వెల్లడించారు. సరోజ్ కుమార్ ను రిమాండ్ కు తరలించారు.