- ఆఫీసర్లు, బ్రోకర్లతో కలిసి జనానికి కుచ్చుటోపీ
- బినామీల పేర్లతో 2 వేల ఎకరాల్లో వెంచర్లు
‘‘ఇగో ఈడనే ఎయిర్పోర్ట్ వస్తది.. మొన్ననే ఆఫీసర్లు వచ్చి సర్వే కూడా చేసిన్రు.. ఎయిర్పోర్ట్ వస్తే ఈ ఏరియా మస్త్ డెవలప్ ఐతది.. మా వెంచర్ల భూమి కొంటే ఏడాదిల రేట్లు డబుల్, ట్రిపుల్ఐతయ్..’’
.. ఇట్లా ఒకటి కాదు రెండు కాదు మూడుచోట్ల మినీ ఎయిర్‌పోర్టు పేరిట మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ముగ్గురు ప్రజాప్రతినిధులు తమ బినామీలు, అనుచరుల సాయంతో 2018 నుంచి రియల్ దందా సాగిస్తున్నారు. తాము అనుకున్న చోట భూములు కొనడం, అక్కడే ఎయిర్‌పోర్ట్‌కు అనుకూలంగా ఉన్నట్లు ఆఫీసర్ల సాయంతో ఎయిర్పోర్ట్ అథారిటీకి ప్రపోజల్స్ పంపడం, ఈలోగా ప్లాట్లు చేసి అమ్మడం, ఆ భూములు పనికిరావని ఎయిర్పోర్ట్ అథారిటీ తేల్చగానే మరో చోట మళ్లీ ఇదే పనిచేస్తూ పోయారు. ఇట్లా ఇప్పటికి మహబూబ్‌నగర్ జిల్లాలోని అడ్డాకుల, భూత్పూర్, దేవరకద్ర మండలాల్లో మినీ ఎయిర్పోర్ట్ పేరు చెప్పి సుమారు రూ. వెయ్యి కోట్ల భూదందాకు పాల్పడ్డారు. చిత్రం ఏమిటంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి 150 కిలోమీటర్ల పరిధిలో కొత్త ఎయిర్పోర్ట్ ఉండరాదని జీఎంఆర్‌తో ఒప్పందం ఉంది. ఈ మూడు ఏరియాలు శంషాబాద్‌కు 150 కిలోమీటర్ల లోపే ఉంటాయి. అయినా.. ఎయిర్పోర్ట్ వస్తదంటూ ప్లాట్లు చేసి అమ్ముతూ సొమ్ముచేసుకుంటున్నారు.
మహబూబ్‌నగర్, వెలుగు: రాని ఎయిర్‌పోర్టు పేరు చెప్పి మహబూబ్‌నగర్‌లో నాలుగేండ్లుగా వేల కోట్ల భూ దందా నడుస్తున్నది. లీడర్లు, బ్రోకర్లు జనాన్ని నమ్మించి నట్టేట ముంచుతున్నరు. ఉడాన్ స్కీం కింద రాష్ట్రాల మధ్య రీజనల్ కనెక్టివిటీ పెంచేందుకు మినీ ఎయిర్ పోర్టులు ఏర్పాటు చేయాలని 2017లో కేంద్రం భావించింది. అనువైన జిల్లాల నుంచి అందుబాటులో ఉన్న స్థలాలతో ప్రపోజల్స్ పంపాలని రాష్ట్రాలను ఆదేశించింది. గతంలో వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల నుంచి విమానాలు నడవడంతో ఎయిర్‍స్ట్రిప్స్ అందుబాటులో ఉన్నాయి. దీంతో ఈ 3జిల్లాలకు తోడు పెద్దపల్లి జిల్లాలోని రామగుండం, కొత్తగూడెం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ప్రాంతీయ విమానాశ్రయాలు ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభు త్వం ప్రకటించింది. 6జిల్లాల్లో మినీ ఎయిర్‌పోర్టులు ఏర్పాటు చేస్తామని కేసీఆర్, కేటీఆర్, మంత్రులు ప్రకటనలు చేస్తూ వచ్చారు. 2018లో స్టేట్ గవర్నమెంట్ పాలమూరుకు మినీ ఎయిర్ పోర్టును ప్రకటించి.. స్థల సేకరణ బాధ్యతలు జిల్లా ఆఫీసర్లు, లీడర్లకు అప్పగించింది. దీంతో రియల్ ఎస్టేట్ దందాకు తెరతీశారు.
సర్కారు ప్రకటనతో ‘రియల్’ ఆలోచన..
శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి 150 కి.మీ పరిధిలో కొత్త ఎయిర్పోర్ట్ నిర్మించరాదని జీఎంఆర్ సంస్థకు, ప్రభుత్వానికి మధ్య ఒప్పందం ఉంది. ఈ లెక్కన మహబూబ్‌నగర్ జిల్లాలో ఎయిర్‌పోర్ట్‌కు చాన్స్ లేనప్పటికీ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు (ఏఏఐ) పంపిన లిస్టులో ఈ జిల్లా పేరును రాష్ట్ర సర్కారు చేర్చింది. ఈ క్రమంలోనే టీఆర్ఎస్కు చెందిన ముగ్గురు లీడర్లు రియల్ ఎస్టేట్ దందాకు తెరతీశారు. ఆఫీసర్ల సాయంతో ఎయిర్‌పోర్ట్‌కు అవసరమైన ప్రభుత్వ భూముల లెక్కలు బయటకు తీయించారు. వాటి చుట్టుపక్కల రైతుల నుంచి తక్కువ ధరకు భూములు కొని, తమ బినామీలు, అనుచరులతో వెంచర్లు చేయించి, ఎయిర్పోర్ట్ పేరుతో భారీ లాభాలకు అమ్మి సొమ్ము చేసుకోవాలని ప్లాన్ వేశారు. అనుకున్నట్లే మొదట అడ్డాకుల మండలం గుడిబండ ఏరియాలో 2018లో తమ ప్లాన్అమలులో పెట్టారు. రైతుల నుంచి వెయ్యి ఎకరాలు కొన్నారు.
ఇక ఆఫీసర్లు రూల్స్‌ను తుంగలో తొక్కి మరీ ప్రజాప్రతినిధులకు సహకరించారు. సర్వే నంబర్ 118లో 120 ఎకరాల ప్రభుత్వ భూమిని, 125 ఎకరాల ప్రైవేట్ భూమిని చూపుతూ ఎయిర్పోర్ట్ అథారిటీకి ప్రపోజల్స్ పంపించారు. ఈలోగా ప్రజాప్రతినిధులు తాము రైతుల నుంచి సేకరించిన వెయ్యి ఎకరాలను వెంచర్లు చేసి ఎయిర్పోర్ట్ వస్తుందంటూ ఫామ్‌ల్యాండ్స్, ప్లాట్లు చేసి అమ్మడం మొదలుపెట్టారు. కానీ, గుడిబండ ఏరియా శంషాబాద్ఎయిర్పోర్ట్ నుంచి కేవలం 115 కిలోమీటర్ల లోపే ఉండడం, ఆ ప్రాంతం చుట్టూ గుట్టలు ఉండటంతో గుడిబండ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి పనికిరాదని ఏఏఐ ఆఫీసర్లు ప్రత్యుత్తరం ఇచ్చారు. ఇప్పటికీ ఈ విషయం జనాలకు చెప్పకుండా ప్లాట్లు అమ్ముతూనే ఉన్నారు. గుడిబండ భూములు పనికిరావని చెప్పడంతో లీడర్లకు మరో చాన్స్ వచ్చినట్లయింది. ఈసారి భూత్పూర్ మండలంలో 300 ఎకరాలు, దేవరకద్ర మండలంలో 700 నుంచి 800 ఎకరాలు స్థానిక రైతుల నుంచి కొని వెంచర్లు పెట్టారు.
ఎప్పట్లాగే భూత్పూర్ మండలంలోని ప్రభుత్వ భూములతో ఎయిర్‌పోర్ట్‌కు ప్రపోజల్ పెట్టారు. ఈ ఏరియా కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి 100 కిలోమీటర్ల లోపే ఉండడం, గుట్టల ప్రాంతం కావడంతో ఏఏఐ రిజెక్ట్ చేసింది. ఆ తర్వాత దేవరకద్ర మండలం చౌదర్పల్లిలో 399 ఎకరాలు, దేవరకద్రలో 63.06 ఎకరాలు, హజిలాపూర్‌లో 35.26 ఎకరాల భూములు ఉన్నాయని, ఇక్కడ మినీ ఎయిర్‌పోర్ట్‌కు అనుకూలంగా ఉందని జిల్లా ఆఫీసర్ల సాయంతో మూడోసారి ప్రపోజల్స్ పంపించారు. దీంతో ఎయిర్‌పోర్ట్స్ ఆథారిటీ ఆఫీసర్లు హజిలాపూర్భూములను కూడా పరిశీలించి వెళ్లారు. ఇక్కడ కూడా ఎయిర్పోర్ట్ వస్తుందని ప్రచారం చేసి ప్రజాప్రతినిధులు భూములను అమ్మడం మొదలుపెట్టారు. కానీ మూడోసారి ప్రపోజల్స్ పెట్టిన చోట మన్యంకొండ గుట్టలు ఉండడంతోపాటు శంషాబాద్ఎయిర్పోర్ట్ నుంచి కేవలం108 కిలోమీటర్ల దూరం ఉండడంతో ఏఏఐ ఆఫీసర్లు రిజెక్ట్చేశారు. ఇలా మోసం చేస్తూ వందల కోట్లు వెనుకేసుకున్నారు.
అగ్గువకు కొని..
ఎయిర్పోర్ట్ పేరుతో 2018 నుంచి ఈ నాలుగేండ్లలో ముగ్గురు ప్రజాప్రతినిధులు కలిసి అడ్డాకుల, భూత్పూర్, దేవరకద్ర మండలాల్లో దాదాపు రెండు వేల ఎకరాలకు పైగానే రైతుల నుంచి అగ్గువకు కొన్నారు. ఎయిర్‌పోర్ట్‌కు ప్రపోజల్స్పెట్టిన ప్రతిసారి ఆయాచోట్ల తమ అనుచరులు, బినామీలతో పాటు గ్రామ స్థాయి లీడర్లను రంగంలోకి దింపుతున్నారు. వాస్తవానికి ఆయా చోట్ల రైతుల నుంచి ఎకరాకు రూ. 5 లక్షలు, రూ.7 లక్షలు, రోడ్ బిట్అయితే రూ. 9 లక్షల వరకు చెల్లించి కొన్నారు. ఇప్పుడు ఇవే భూములను ఎకరాకు రూ. 40 లక్షల నుంచి 50 లక్షలకు, రోడ్‌సైడ్ అయితే ఎకరాను రూ. 90 లక్షల నుంచి 1.20 కోట్ల వరకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఫామ్ ల్యాండ్స్ అయితే గుంటల (120 గజాలు) లెక్కన ఒక్కో గుంటను రూ.10 లక్షల నుంచి 12 లక్షల వరకు, రోడ్డు బిట్ అయితే రూ.12 లక్షల నుంచి 16 లక్షల వరకు అమ్ముతున్నారు. దీంతో తమకు మాయమాటలు చెప్పి అగ్గువకు భూములు కొట్టేసిన లీడర్లు, తమ కండ్ల ముందే కోట్లకు అమ్ముకుంటుంటే రైతులు ఆవేదన చెందుతున్నారు.
18 లక్షలకు కొని.. 55 లక్షలకు అమ్మిన్రు
నాకున్న 1.2 ఎకరాల భూమిలో వరి వేస్తుంటి. నాకు రూ.12 లక్షల అప్పులు ఉండే. ఏడాదిన్నర కింద పాలమూరుకు చెందిన ఒకాయన నా దగ్గరకు వచ్చిండు. పొలం కొంటామని చెబి తే, అవసరం అయ్యి రూ.18 లక్షలకు అమ్మిన. నేను అమ్మిన కొద్ది రోజులకే ఇక్కడ విమానాలు వస్తయని అన్నరు. నేను అమ్మిన పొ లాన్ని రూ. 55 లక్షలకు అమ్మిన్రు. అది తెలిసి ఏడుపొచ్చింది.
- కౌకుంట్ల పెద్ద పుల్లయ్య, హజిలాపూర్ గ్రామం, దేవరకద్ర మండలం
నా దగ్గర కొని హైదరాబాదోళ్లకు అమ్మిన్రు
నాకు ఊరి శివారులో రోడ్డు పక్కనే రెండున్నర ఎకరాల పొలం ఉంది. అవసరమయ్యి 1.16 ఎకరాల భూమిని ఏడాదిన్నర కిందట అమ్మిన. మొత్తం రూ.30 లక్షల వరకు పైసలిచ్చిన్రు. కొద్ది రోజులకే ఎయిర్‌పోర్టు వస్తదని చెప్పిన్రు. నా దగ్గర కొన్న పొలాన్ని హైదరాబాదోళ్లకు రూ. 70 లక్షలకు అమ్మిన్రని తెలిసింది.
- పుల్లయ్య, హజిలాపూర్ గ్రామం, దేవరకద్ర మండలం
రేట్లు బాగా పెరిగినయ్
మూడేండ్ల కింద దాకా మా ఊరి చుట్టూ ఉన్న భూములకు ధరలే లేకుండే. ఏడాదిన్నర కింద మినీ ఎయిర్ పోర్టు వస్తదని అన్నరో, అప్పటి నుంచి రేట్లు పెరిగినయ్. అప్పటి దాకా లోపల ఉన్న పొలాలు ఎకరానికి రూ.5 లక్షలు.. రోడ్డు పక్కనున్న పొలాలు రూ.8 లక్షల వరకు పలికేవి. ఇప్పుడు ఇవే భూములు రూ.40 లక్షల నుంచి 70లక్షల దాకా పలుకుతున్నయ్. అప్పట్లో భూములు అమ్ముకున్న రైతులు, ఇప్పుడున్న ధరలు చూసి మస్తు బాధపడుతున్నరు.
- బుచ్చిరెడ్డి, సర్పంచ్, హజిలాపూర్, దేవరకద్ర మండలం