ఊరికి వెయ్యి తాటి, ఈత మొక్కలు నాటుతాం: ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్

ఊరికి వెయ్యి తాటి, ఈత మొక్కలు నాటుతాం: ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్

హైదరాబాద్‌, వెలుగు: హరితహారం కార్యక్రమంలో భాగంగా అబ్కారీ శాఖ ఆధ్వర్యంలో ఒక్కో గ్రామంలో వెయ్యి చొప్పున తాటి, ఈత, ఖర్జూర మొక్కలు నాటాలని రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ఆదేశించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 4వేల గ్రామ పంచాయతీలను తాటి, ఈత వనాల గ్రామాలుగా మార్చాలన్నారు. శనివారం రవీంద్ర భారతిలో హరితహారంపై ఆయన రివ్యూ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ విడత 3లక్షల ఈత మొక్కలను నాటామన్నారు. నీరా పాలసీలో భాగంగా కేరళలో ఉన్న సెంట్రల్‌ ప్లాంటేషన్‌ క్రాప్ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూ ట్‌తో టెక్నాలజీ మార్పిడి త్వరగా చేయాలని, పెట్ బాటిల్ ప్యాకింగ్‌పై త్వరగా స్టడీ పూర్తి చేయాలని చెప్పారు. కల్లు గీత కార్మికులు ప్రమాదవశాత్తు చెట్లపై నుంచి కిందపడి శాశ్వత దివ్యాంగులైన, మరణించిన వారి విషయంలో బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. ఆబ్కారీ డైరక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, అడిషనల్‌ కమిషనర్ అజయ్ రావు, అసిస్టెంట్‌ కమిషనర్‌ హరికిషన్, డిప్యూటీ కమిషనర్ ఎస్‌వై ఖురేషీ తదితరులు పాల్గొన్నారు.