![హైదరాబాద్లో బట్టలు కొనిస్తామని చెప్పి మూడు నెలల చిన్నారిని ఎత్తుకెళ్లారు.. ఎలా దొరికారంటే..](https://static.v6velugu.com/uploads/2025/02/a-three-month--old-child-was-abducted-by-saying-that-they-would-buy-clothes-and-how-police-chased-the-case_4DfbEvr538.jpg)
బట్టలు కొనిస్తామని నమ్మించి ఓ తల్లి నుండి మూడు నెలల చిన్నారిని దుండగులు ఎత్తుకెళ్లిన ఘటన హైదరాబాద్ కాచిగూడ పోలీస్ స్టేషన్ లో జరిగింది. బాధితుల ఫిర్యాదుతో కాచిగూడ పోలీసులు గంటల వ్యవధిలోనే కేసును ఛేదించారు. ఈ ఘటనపై ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి, అడిషనల్ డీసీపీ నరసయ్య చెప్పిన వివరాల ప్రకారం..
గౌలిగూడా ప్రాంతానికి చెందిన బోగ నర్సింగ్ రాజ్ పంజాగుట్ట లోని ఓ ప్రేవేట్ హాస్పిటల్ లో టెక్నీషియన్ గా పని చేస్తున్నాడు. అతనికి కార్వాన్ ప్రాంతానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి రాఘవేంద్ర , ఉమావతి అనే మహిళతో పరిచయం ఉంది. ఉమావతి పని చేస్తున్న బట్టల షాపులో పని చేస్తున్న సంధ్యారాణి అనే మహిళకు పిల్లలు లేకపోవడంతో, తాను పెంచుకోడానికి పిల్లలు కావాలని ఉమావతిని కోరింది.
ఉమావతి ఈ విషయాన్ని నర్సింగ్ రాజ్ , రాఘవేంద్ర లకు తెలిపింది. వారు తమకు తెలిసిన వాళ్ళు పిల్లలను దత్తతకు ఇస్తారని , వారికి లక్షన్నర డబ్బులు ఇవ్వాలని సంధ్యారాణికి తెలిపారు. దానికి అంగీకరించిన సంధ్యారాణి తొలివిడతగా లక్ష రూపాయలు చెల్లించింది. డబ్బులు చెల్లించి ఆరు నెలలు గడుస్తున్నా ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడంతో సంధ్యారాణి వారిపై ఒత్తిడి చేసింది. దీనితో ఎవరినైనా కిడ్నప్ చేసి , ఆమెకు చిన్నారిని అందించాలని ప్లాన్ వేశారు.
Also Read :- సగం ధరకే స్కూటర్లు, టీవీలు, కంప్యూటర్లు, ల్యాప్ టాప్స్
చాదర్ ఘాట్ చౌరస్తా లో మూడు నెలల మగ శిశువు తో భిక్షాటన చేసున్న వరలక్ష్మి అనే మహిళ ను నర్సింగ్ రాజ్ కొత్త బట్టలు ఇప్పిస్తానని మాటల్లో పెట్టాడు. తన వెంట కాచిగూడ డీ-మార్ట్ కు తీసుకెళ్లాడు. వరలక్ష్మి బట్టలు చూస్తుండగా చిన్నారిని నర్సింగ్ రాజ్ అక్కడి నుండి తీసుకొని పరారయ్యాడు. దీనితో తల్లి వరలక్ష్మి కాచిగూడ పోలీసులకు సోమవారం సాయంత్రం ఫిర్యాదు చేసింది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసును ఛేదించారు. నర్సింగ్ రాజ్ చిన్నారిని ఆటో లో కార్వాన్ కు తీసుకెళ్లినట్లు గుర్తించారు. వెంటనే అక్కడికి చేరుకుని నర్సింగ్ రాజ్ , రాఘవేంద్రలను అదుపులోకి తీసుకన్నారు. చిన్నారిని తల్లి చెంతకు చేర్చారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించామని , ఉమావతి పరారీలో ఉన్నట్లు డీసీపీ తెలిపారు. ఐదు గంటల్లో కేసును ఛేదించిన ఇన్ స్పెక్టర్ చంద్ర కుమార్ , ఎస్సైలు సుభాష్ , రవి కుమార్, ఇతర సిబ్బందిని డీసీపీ అభినందించారు.