- ఆసిఫాబాద్ జిల్లాలో దారుణం
ఆసిఫాబాద్/కాగజ్ నగర్, వెలుగు: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టి మండలం వెంకట్రావు పేట్ లో ఆడుకుంటున్న మూడేండ్ల బాలికను ఎత్తుకెళ్లిన ఓ యువకుడు లైంగికదాడి చేశాడు. పోలీసుల కథనం ప్రకారం..గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మూడేండ్ల కూతురు ఆదివారం ఉదయం తోటి పిల్లలతో కలిసి ఇంటి సమీపంలో ఆడుకుంటోంది. ఆ టైంలో అక్కడకు వచ్చిన గ్రామానికి చెందిన బుడే రాజేందర్ (24) పాపతో ఆడుకుంటున్న పిల్లలను కొట్టి బాలికను ఎత్తుకెళ్లాడు. దీంతో పిల్లలు పరిగెత్తుకు వెళ్లి పాప తండ్రికి చెప్పారు. ఆయన నిందితుడి ఇంటికి వెళ్లగా అప్పటికే పాప రక్తస్రావంతో ఏడుస్తూ ఉంది. వెంటనే సిర్పూర్ టీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు నిందితుడు రాజేందర్‌పై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగజ్ నగర్ డీఎస్పీ కరుణాకర్, సీఐ సాదిక్ పాషా, ఎస్సై రమేశ్ విచారణ మొదలుపెట్టారు. సోమవారం నిందితుడిని రిమాండ్ కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు.