ఆస్ట్రేలియా షాపింగ్ మాల్లో కత్తిపోట్లు

  • మహిళలు సహా ఆరుగురు మృత్యువాత

సిడ్నీ: ఆస్ట్రేలియాలో దారుణం జరిగింది. ఓ దుండగుడు సిడ్నీలోని షాపింగ్ మాల్ లోకి చొరబడి, అక్కడున్న జనంపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఆరుగురు చనిపోగా, 8 మంది గాయపడ్డారు. సిడ్నీలోని వెస్ట్ ఫీల్డ్ షాపింగ్ సెంటర్ లోకి శనివారం మధ్యాహ్నం ఓ దుండగుడు చొరబడ్డాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో షాపింగ్ మాల్ లో అటూఇటూ తిరుగుతూ జనంపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్ కు చేరుకుని దుండగుడిని మట్టుబెట్టారు.

ఆ దుండగుడిని ఓ మహిళా ఇన్ స్పెక్టర్ కాల్చి చంపారు. ‘‘ఈ ఘటనలో ఆరుగురు చనిపోయారు. వారిలో ఐదుగురు మహిళలు ఉన్నారు. మరో 8 మంది గాయపడ్డారు. వారిలో 9 నెలల చిన్నారి ఉంది. ఆ చిన్నారికి ఆపరేషన్ జరుగుతోంది” అని కమిషనర్ కరెన్ వెబ్ తెలిపారు. పోలీసుల కాల్పుల్లో దుండగుడు చనిపోయాడని, అయితే అతని వివరాలు ఇంకా తెలియలేదని చెప్పారు. ఇది టెర్రర్ దాడి కాదని స్పష్టం చేశారు. దుండగుడికి 40 ఏండ్లు ఉంటాయని, దీని వెనకున్న కారణలేంటో తెలియాల్సి ఉందన్నారు. కాగా, దుండగుడిని కాల్చి చంపిన మహిళా ఇన్​స్పెక్టర్​ను ప్రధాని అల్బనీస్ అభినందించారు.

పరుగులు పెట్టిన జనం.. 

దుండగుడు కత్తితో షాపింగ్ మాల్​లో హల్ చల్ చేశాడు. పరుగులు పెడుతూ విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డాడు. దీంతో గాయాలైనోళ్లు ఎక్కడికక్కడ పడిపోవడం చూసి జనం భయంతో పరుగులు పెట్టారు. మాల్​లోని షాప్స్​లో దాక్కున్నారు. కొంతమంది ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా బయటపడ్డారు.