డెబిట్​కార్డు తారుమారు చేసి డబ్బులు స్వాహా

డెబిట్​కార్డు తారుమారు చేసి డబ్బులు స్వాహా
  • పోలీసుల నిర్లక్ష్యంతో ఆలస్యంగా కేసు

ఇబ్రహీంపట్నం, వెలుగు: డెబిట్ ​కార్డును తారుమారు చేసి ఓ దుండగుడు రూ.40 వేలు కొట్టేశాడు. పోలీసుల నిర్లక్ష్యం కారణంగా ఈ ఘటనపై ఆలస్యంగా కేసు నమోదైంది. యాచారం గ్రామానికి చెందిన పోలెపల్లి అరుణ ఫిబ్రవరి 5న తన కొడుకు సాయిబాబాకు ఎస్బీఐ ఏటీఎం కార్డు ఇచ్చి కొత్త పిన్ జనరేట్ చేసుకురమ్మని పంపింది. దీంతో యాచారంలో ఉన్న ఏటీఎం సెంటర్​కు సాయిబాబా వెళ్లాడు. అయితే, అతనికి పిన్ జనరేట్ చేయడం రాకపోవడాన్ని ఓ గుర్తుతెలియని వ్యక్తి గమనించాడు. తాను పిన్ జనరేట్ చేసి ఇస్తానని నమ్మించి, ఏటీఎం కార్డును తీసుకున్నాడు.

ఆ తర్వాత పిన్ జనరేట్ ​చేసి, మరో కార్డును సాయిబాబా చేతికి ఇచ్చాడు. కొద్దిసేపటికి ఇబ్రహీంపట్నంలోని ఏటీఎం నుంచి రూ.10 వేలు, మరోసారి రూ.30 వేలు డ్రా చేసినట్టు బాధితురాలు అరుణకు మేసేజ్ వచ్చింది. బాధితురాలు అదే రోజు యాచారం పోలీసులను ఆశ్రయించగా, అప్పటి సీఐ నర్సింహ రావు కేసు నమోదు చేయలేదు. తాజాగా బాధితురాలు ఇబ్రహీంపట్నం ఏసీపీని ఆశ్రయించడంతో కేసు నమోదైంది. నిందితుడి కోసం గాలిస్తున్నారు.