ఏపీలో టమాటా రైతు హత్య.. డబ్బుల కోసమే చంపినట్టు అనుమానం

ఏపీలో టమాటా రైతు హత్య
డబ్బుల కోసమే చంపినట్టు అనుమానం
పంట అమ్మగా వచ్చిన డబ్బుల కోసం చంపి ఉంటారని అనుమానాలు

చిత్తూరు : ఏపీలో టమాట రైతు దారుణ హత్యకు గురయ్యాడు. చేతులను కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి గుర్తుతెలియని దుండగులు ఆ రైతును చంపేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఈ ఘటన జరిగింది. మృతుడిని రాజశేఖర్ రెడ్డిగా గుర్తించారు. గత కొద్ది రోజుల పాటు టమాట ధరలు బాగా పెరిగిన సంగతి తెలిసిందే. పెరిగిన రేట్లు సామాన్యుడికి భారంగా మారగా.. రైతులకు లాభాలు తెచ్చిపెడుతున్నాయి. దీంతో రాజశేఖర్  టమాటలు అమ్మగా వచ్చిన డబ్బుల కోసమే దుండగులు ఆయనను చంపి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మదనపల్లె మండలం బోడిమల్లదిన్నెకు చెందిన నారెం రాజశేఖర్‌ రెడ్డి టమాట పంట వేశారు. పంట చేతికొచ్చింది. పంటకు భారీగా డిమాండ్ రావడంతో భార్యాభర్త ఇద్దరూ పొలంలోనే మకాం వేసి కాపలా కాసుకుంటున్నారు.

రాజశేఖర్‌ రెడ్డి ఇప్పటికే ఐదు కోతలు టమాటలు కోసి అమ్మాడు. ఈ క్రమంలో ఈ నెల 11న (మంగళవారం) కూడా మరోసారి టమాటలు కోసి మార్కెట్​లో దించివచ్చాడు. అదేరోజు రాత్రి పాలు పోయడానికి ఊర్లోకి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో భార్య ఆందోళన పడింది. రాజశేఖర్‌ రెడ్డి బంధువుకు ఫోన్  చేసి విషయం చెప్పింది. దీంతో వారు రాజశేఖర్​ను వెతుక్కుంటూ వెళ్లగా ఓ చోట ఆయన బైక్, మొబైల్ ఫోన్  పడి ఉండడం గమనించారు. చుట్టుపక్కల వెతకగా ఓ చోట చెట్టు కింద రాజశేఖర్ రెడ్డి మృతదేహం కనిపించింది. వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.