- ఖమ్మంలో 94.06 శాతం.. భద్రాద్రికొత్తగూడెంలో 92.40 శాతం బాలికలు పాస్
- రాష్ట్ర వ్యాప్తంగా 21వ స్థానంలో ఖమ్మం జిల్లా.. 26వ స్థానంలో భద్రాద్రికొత్తగూడెం జిల్లా
భద్రాద్రికొత్తగూడెం/ ఖమ్మం టౌన్/నెట్వర్క్, వెలుగు : పదో తరగతి రిజల్ట్స్ లో గర్ల్స్ టాప్ లో నిలిచారు. ఖమ్మం జిల్లాలో మొత్తం 16,541 మంది స్టూడెంట్స్ ఎగ్జామ్ రాయగా,15258 మంది పాసయ్యారు. జిల్లా వ్యాప్తంగా 92.24 ఉత్తీర్ణత నమోదైంది. బాయ్స్ 8,521 మంది ఎగ్జామ్ రాయగా, 7,714 మంది పాసయ్యారు(90.53 శాతం), గర్ల్స్ 8,020 మంది పరీక్ష రాయగా, 7544 మంది(94.06 శాతం) పాసయ్యారు. మొత్తం 1,283 మంది స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యారు. ఖమ్మం జిల్లా గతేడాది రాష్ట్ర వ్యాప్తంగా 18 స్థానంలో నిలవగా, ఈసారి 21వ స్థానానికి పడిపోయింది.
భద్రాద్రికొత్తగూడెంలో మెరుగైన ఫలితాలు..
భద్రాద్రికొత్తగూడెం జిల్లా లాస్ట్ ఇయర్ కంటే ఈ సారి మెరుగైన ఫలితాలు సాధించింది. గతేడాది 78.53శాతం సాధించగా, ఈ ఏడాది 90.39శాతం ఉత్తీర్ణత సాధించింది. రాష్ట్రంలో జిల్లా 26వ స్థానం దక్కించుకుంది. గత మూడేండ్లుగా 29, 30 స్థానాలతో సరిపెట్టుకుంటుండగా ఈసారి 26వ స్థానానికి ఎగబాకడం విశేషం. జిల్లాలో 12,294 మంది ఎగ్జామ్ రాయగా 11,112 మంది పాస్ అయ్యారు. 5,875 మంది బాయ్స్ ఎగ్జామ్ రాయగా 5,181, గర్ల్స్ 6,419 మందికి గానూ 5,931 మంది ఉత్తీర్ణులయ్యారు.
బాలుర కంటే బాలికలు 4.21శాతం అధికంగా ఉత్తీర్ణత సాధించి తమ సత్తా చాటారు. జిల్లాలోని 87 స్కూళ్లు వంద శాతం రిజల్ట్ సాధించాయి. అందులో ప్రభుత్వ పాఠశాలలు 52 కాగా, 35 ప్రైవేట్ స్కూళ్లు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 70 మంది స్టూడెంట్స్ 10 జీపీఏ సాధించారు. వీరిలో 68 మంది ప్రైవేట్ స్కూల్స్‌కు చెందిన వారే. జిల్లాలో ఒక్క ప్రైవేట్ స్కూల్ మాత్రం జీరో శాతం రిజల్ట్ సాధించింది.
కలెక్టర్ అభినందన..
మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేసిన విద్యాశాఖాధికారులు, హెచ్ఎంలు, టీచర్లను భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ ప్రియాంక అల అభినందించారు. ఉత్తీర్ణులైన స్టూడెంట్స్‌తో పాటు 10 జీపీఏ సాధించిన విద్యార్థులకు కలెక్టర్ అభినందనలు తెలిపారు. రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం ఈ నెల 15వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని డీఈవో వెంకటేశ్వరాచారి, ఏసీజీఈ ఎస్ మాధవరావు పేర్కొన్నారు. ఫెయిల్ అయిన స్టూడెంట్స్ ఈ నెల 16వ తేదీ లోపు ఎగ్జామ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు.
ఐటీడీఏ విద్యార్థుల ప్రభంజనం
భద్రాచలం, వెలుగు : పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ఈ ఏడాది భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గిరిజన సంక్షేమశాఖ విద్యాసంస్థల్లో చదివిన విద్యార్ధులు ప్రభంజనం సృష్టించారు. ఉత్తమ ఫలితాలు సాధించారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని 45 ఆశ్రమ పాఠశాలల్లో 1878 విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, 1711 మంది పాసయ్యారు. 91.11శాతం ఉత్తీర్ణత వచ్చింది. రామచంద్రునిపేట, కరకగూడెం, అంకంపాలెం, భీమునిగూడెం, డి.గొల్లగూడెం, పార్కులగండి, రేగళ్ల తండా, అనంతోగు, గంగారం, మామకన్ను, మర్కోడు, శంభునిగూడెం ఆశ్రమాల్లో 100శాతం ఉత్తీర్ణత నమోదైంది.
13 గిరిజన సంక్షేమశాఖ హాస్టళ్లలో 198 మంది పరీక్షలకు హాజరుకాగా 167 మంది పాసయ్యారు. 84.34శాతం ఉత్తీర్ణత వచ్చింది. అశ్వారావుపేట, దమ్మపేట, గుండాల(బాయ్స్), గుండాల(గర్ల్స్), ఇల్లెందు హాస్టళ్లలో 100శాతం రిజల్ట్ వచ్చింది. ఖమ్మం జిల్లాలోని గిరిజన సంక్షేమశాఖ విద్యాసంస్థల్లో పదో తరగతి చదివిన విద్యార్ధులు ఉత్తమ ఫలితాలు సాధించారు. 10 గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో 315 మంది హాజరుకాగా 263 మంది పాసయ్యారు. 83.49శాతం ఉత్తీర్ణత నమోదైంది. 8 సంక్షేమహాస్టళ్లలో 120 మంది పరీక్షలకు హాజరుకాగా 104 మంది పాసయ్యారు. 86.67శాతం ఉత్తీర్ణత వచ్చింది. కూసుమంచి, మధిర,సత్తుపల్లిల్లో 100శాతం రిజల్ట్ వచ్చింది.
గురుకులాల్లో 98.90శాతం
ఖమ్మం రీజియన్‌లోని గురుకులాల్లో టెన్త్ రిజల్ట్ లో 98.90శాతం ఉత్తీర్ణత నమోదైంది. 12 గురుకులాల్లో 910 మంది పరీక్షలు రాస్తే 900 మంది పాసయ్యారు. వైరా గురుకుల పాఠశాలలో కొత్తపల్లి ఉదయశ్రీ 10 జీపీఏ సాధించారు. అన్నపురెడ్డిపల్లి, దమ్మపేట, కేఎస్డీ సైట్, గుండాల, ఖమ్మం, సింగరేణి గురుకులాలు 100శాతం రిజల్ట్ సాధించాయి.