మునుగోడు ఉప ఎన్నిక బరిలో 47 మంది

మునుగోడు నామినేషన్ ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. ఉప ఎన్నిక బరిలో మొత్తం 47 మంది అభ్యర్థులు ఉన్నారు. మొత్తం 130 మంది నామినేషన్లు వేశారు. స్క్రూటీనీలో 47 మంది నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. దీంతో 83 మంది అభ్యర్థుల్లో 36 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. చివరకు మునుగోడు ఉప ఎన్నిక బరిలో 47 మంది అభ్యర్డులు మిగిలారు. మునుగోడు ఉపఎన్నిక నవంబర్ 3వ తేదీన జరగనుండగా, 6వ తేదీన ఫలితాన్ని వెల్లడిస్తారు.   

మునుగోడు ఉప ఎన్నిక రాష్ట్రంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు కీలకంగా మారింది. మునుగోడు ఉప ఎన్నికలో విజయం సాధిస్తే, రాబోయే ఎన్నికలపైనా ఆ ప్రభావం తప్పనిసరిగా ఉంటుందని అన్ని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో మునుగోడును సీటును గెలుచుకునేందుకు అన్ని పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇప్పటికే ప్రచారంలో మరింత స్పీడు పెంచాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులు హోరా హోరీగా ప్రచారం చేస్తున్నారు. 

టీఆర్ఎస్ పార్టీ నుండి అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుండి పాల్వాయి స్రవంతి, బీఎస్పీ నుంచి అందోజు శంకరాచారి, టీ‌జే‌ఎస్ నుంచి పల్లె వినయ్ కుమార్ బరిలో ఉన్నారు. ఇప్పటికే అభ్యర్థులు ఎవరికి వారు సరికొత్త వ్యూహాలతో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు.