- విద్యా సంవత్సరం ప్రారంభమై నెలలు గడుస్తున్నా ఇంకా తెరువలె..!
- ఇబ్బందులు పడుతున్న స్టూడెంట్లు
- పట్టించుకొని ఆఫీసర్లు
కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రం లో మోడల్ స్కూల్ ఉంది. స్కూల్ తో పాటు జూనియర్ కాలేజీ కూడా ఉన్న ఇక్కడ మొత్తం 767 మంది స్టూడెంట్లు చదువుతున్నారు. వీరిలో 267 మంది ఇంటర్మీడియట్ స్టూడెంట్లు ఉన్నారు. స్కూల్ లో ఉన్నత విద్యను చదివే స్టూడెంట్స్కోసం రూ.కోటి 28 లక్షలతో హాస్టల్ బిల్డింగ్నిర్మాణం చేశారు. 2015 లో ప్రారంభమైన హాస్టల్ ఈ బిల్డింగ్ ఏడేళ్లకే శిథిలావస్థకు చేరింది. మెయింటెనెన్స్ లేక కిచెన్ అధ్వానంగా మారింది. కిచెన్ తో పాటు రూమ్స్, బాత్రూంల డోర్లు విరిగిపోయాయి. కరెంట్ వైర్లు కాలిపోవడం, స్విచ్ బోర్డులు ఊడిపోయి వేలాడుతున్నాయి. అయితే చిన్న చిన్న రిపేర్లు చేయిస్తూ ఏడాది పాటు నెట్టుకొచ్చారు. బిల్డింగ్ శిథిలావస్థకు చేరిన విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కొన్నా ళ్ల కింద కలెక్టర్ జితేష్ వి పాటిల్ కూడా పరిశీలించారు. రిపేర్ చేయించేందుకు ప్రతిపాధనలు పంపాలని ఆఫీసర్లను ఆదేశించారు. దీంతో కొత్త డోర్ల బిగింపు, బాత్రూంలు, ఇతర రిపేర్లు చేసేందుకు మొత్తం రూ.10 లక్షల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఏడాది గడుస్తున్నా ఇప్పటి వరకు చిల్లి గవ్వ కూడా శాంక్షన్ కాలేదు. ఇప్పటికైనా ఆఫీసర్లు స్పందించాలని తల్లిదండ్రులు అంటున్నారు.
నెలలు గడుస్తున్నా...
బిల్డింగ్ శిథిలం కావడంతో ఈ సారి ఇంకా హాస్టల్ఓపెన్ కాలేదు. ఇంటర్మీడియట్క్లాస్ లు షూరు అయి నెలలు గడుస్తున్నాయి. ఇంటర్లో మొత్తం 267 మంది స్టూడెంట్లు ఉంటే ఇందులో గర్ల్స్ 199 మంది ఉన్నారు. ఇంటర్మీడియట్ తో సదాశివనగర్మండలంతో పాటు రామారెడ్డి, గాంధారి, కామారెడ్డి, భిక్కనూరు, రాజంపేట, మాచారెడ్డి మండలాలకు చెందిన గర్ల్స్ కూడా చేరారు. రోజు బస్సులో వచ్చి వెళ్తున్నారు. కొన్ని మండలాలకు చెందిన స్టూడెంట్లు రెండు బస్సులు మారి రావాల్సి వస్తోంది. హాస్టల్వసతి ఉంటుందనే ఉద్దేశంతో కాలేజీలో చేర్పించారు. నెలలు గడుస్తున్నా హాస్టల్ ఓపెన్ చేయకపోవడంతో స్టూడెంట్లు ఇబ్బందులకు గురవుతున్నారు. ఫస్ట్ ఇయర్ లో చేరిన స్టూడెంట్లు హాస్టల్ వసతి లేక వెళ్లిపోతున్నారు.
ఆఫీసర్లు స్పందించాలి
మోడల్ స్కూల్ లో హాస్టల్ ఉందనే ఇక్కడ పిల్లలను చేర్పించాం. కానీ హాస్టల్ బిల్డింగ్రిపేర్ లో ఉండడం తెరవడం లేదు. దీంతో పిల్లలు రోజూ బస్సులో వెళ్లి రావడం ఇబ్బంది పడుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి.
- శ్రీనివాస్, స్టూడెంట్ తండ్రి