- కోరుట్లలో వారసుల వార్
- గెలుపు కోసం అర్వింద్, సంజయ్, నర్సింగ రావు స్పెషల్ స్ట్రాటజీస్
- కాంగ్రెస్, బీజేపీలకు ప్రచార అస్త్రంగా ముత్యంపేట
- షుగర్ ఫ్యాక్టరీ రీఓపెన్పసుపు బోర్డు ప్రకటనపై అర్వింద్ ఆశలు
- అభివృద్ధి, సంక్షేమ పథకాలను నమ్ముకున్న బీఆర్ఎస్
జగిత్యాల, వెలుగు : జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో టఫ్ ఫైట్ తప్పేలా లేదు. మూడు ప్రధాన పార్టీల నుంచి సీనియర్ నేతల వారసులు బరిలో ఉండడం ఆసక్తి రేపుతోంది. బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు కొడుకు డాక్టర్ సంజయ్‌కుమార్, కాంగ్రెస్ నుంచి దివంగత నేత జువ్వాడి రత్నాకర్‌రావు కొడుకు నర్సింగరావు, బీజేపీ నుంచి డీఎస్ కొడుకు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పోటీ చేస్తున్నారు. పదేండ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై బీఆర్ఎస్ అభ్యర్థి ప్రచారం చేస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ఓట్లుగా మలచుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు. ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తానన్న హామీని కేసీఆర్ నిలబెట్టుకోలేకపోవడాన్ని ఈ ఇద్దరూ ఎత్తిచూపుతున్నారు. ఇటీవల పసుపు బోర్డు ఏర్పాటుపై కేంద్రం ప్రకటన చేయడంతో దానిని బీజేపీ అభ్యర్థి అర్వింద్ప్రచారాస్త్రంగా మలుచుకున్నారు.
నర్సింగరావుకు ఇంటిపోరు
జువ్వాడి రత్నాకర్ తనయుడు జువ్వాడి నర్సింగరావు గత ఎన్నికల్లో కోరుట్ల నుంచి కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేసి ఓడిపోయారు. మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బరిలో నిలిచారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను ఇంటింటికి వెళ్లి వివరిస్తున్నారు. తన తండ్రి రత్నాకర్‌రావు మంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని గుర్తుచేస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో కట్టించిన ఇందిరమ్మ ఇండ్లు, తీసుకొచ్చిన వెటర్నరీ కాలేజీ, డిగ్రీ కాలేజీ గురించి పదేపదే ప్రస్తావిస్తున్నారు. ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ రీ ఓపెనింగ్ కోసం రైతుల పక్షాన చేసిన పోరాటం నర్సింగరావుకు కలిసి వస్తుందని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నారు. కోరుట్లలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ పర్యటనతో పాటు, పాదయాత్రలో ముత్యంపేట చెరుకు ఫ్యాక్టరీని రీఓపెన్ చేయిస్తామని రేవంత్‌రెడ్డి ప్రకటన ఓట్లు తెచ్చి పెడుతాయని చెబున్నారు. కానీ మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి జ్యోతక్క, ఆమె కొడుకు కరంచంద్‌తో పాటు, సీనియర్ నేతలు కల్వకుంట్ల సుజిత్ రావు, కాటిపల్లి శ్రీనివాస్ రెడ్డి కోరుట్ల కాంగ్రెస్టికెట్ఆశించి భంగపడ్డారు. వీరంతా నర్సింగరావుకు ఏమేరకు సహకరిస్తారనేదానిపై కాంగ్రెస్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. దీంతో అసంతృప్త నేతలందరినీ పిలిపించుకున్న పార్టీ పెద్దలు, నర్సింగరావు గెలుపు కోసం పనిచేయాలని, అధికారంలోకి వచ్చాక సముచిత స్థానం కల్పిస్తామని బుజ్జగిస్తున్నట్లు తెలుస్తున్నది.
యువతను ఆకట్టుకునే పనిలో సంజయ్
ప్రస్తుత ఎమ్మెల్యే, తండ్రి విద్యాసాగర్‌రావుతో కలిసి డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కుమార్ కొంత కాలంగా కోరుట్ల బీఆర్ఎస్లో యాక్టివ్‌గా పనిచేస్తున్నారు. ఫ్రీ హెల్త్ క్యాంపులు పెట్టడంతోపాటు ఉద్యోగ మేళాలు పెట్టి గుర్తింపు పొందారు. స్థానికంగా తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తూ డిస్కౌంట్ల డాక్టర్‌గా పేరు ఉంది. వీటితోపాటు ఎమ్మెల్యేగా తండ్రి చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు తనని గెలిపిస్తాయని సంజయ్ భావిస్తున్నారు. ఇటీవల ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి వచ్చాక కోరుట్లలో అత్యధికంగా ఉన్న బీడీ కార్మికులు, మహిళలకు పెన్షన్లు ఇస్తామని, పీజీ కాలేజీ ఏర్పాటు, ప్రైవేట్‌రంగంలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. మేనిఫెస్టోతోపాటు, సీఎం హామీలను సంజయ్ జనంలోకి తీసుకుపోతున్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం షుగర్ ఫ్యాక్టరీ రీఓపెన్ చేయించకపోవడం బీఆర్ఎస్కు మైనస్‌గా కనిపిస్తోంది. రైతులతోపాటు, మైనార్టీల ఓట్లు ఎక్కువగా చీలిపోయే అవకాశం ఉందనే చర్చ జరుగుతున్నది.
రైతుల ఓట్లపైనే అర్వింద్ గురి
నిజామాబాద్ ఎంపీగా ఉన్న ధర్మపురి అర్వింద్ ఈసారి ఎమ్మెల్యేగా బీజేపీ నుంచి కోరుట్ల బరిలో నిలిచారు. ఇక్కడ బీజేపీ టికెట్ కోసం సీనియర్ నేత సురభి భూమ్ రావు కొడుకు నవీన్, డాక్టర్ జేఎన్ వెంకట్ పోటీపడ్డారు. కేంద్రం పసుపు బోర్డు ఏర్పాటు ప్రకటన చేయడంతో అర్వింద్ కోరుట్ల నియోజకవర్గాన్ని ఎంచుకొని రంగంలోకి దిగారు. ఫైర్ బ్రాండ్‌గా పేరున్న అర్వింద్.. ఎంపీగా గడిచిన నాలుగున్నరేండ్లలో చేసిన అభివృద్ధి, కేంద్రం నుంచి విడుదల చేయించిన నిధులు, పసుపు బోర్డు ఏర్పాటు లాంటి అంశాలపై ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కేంద్రాన్ని ఒప్పించి, రాష్ట్రానికి పసుపుబోర్డు తెచ్చానని చెప్పు కుం టున్నారు. ఈ పసుపు బోర్డే తనను గెలిపిస్తుందనే ఆశతో అర్వింద్ ఉన్నారు. ఎమ్మెల్యేగా గెలిపిస్తే ముత్యంపేట షుగర్‌ఫ్యాక్టరీ తెరిపిస్తానని హామీ ఇస్తున్నారు. కొత్తగా ఫ్యాక్టరీల ఏర్పాటు చేయించి, స్థాని క యువతకు ఉద్యోగాలు వచ్చేలా చేస్తానంటున్నారు. కానీ సెగ్మెంట్లో పెద్దసంఖ్యలో ఉన్న మైనార్టీల ఓట్లు బీజేపీకి ఎంతవరకు పడ్తాయనేదానిపై అర్వింద్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.
ALSO READ: మెదక్: చివరిరోజు నామినేషన్ల జోరు